జగన్ నుంచి పులివెందుల లాగేసుకుంటా...?

Update: 2022-11-09 15:36 GMT
ఏపీ సీఎం జగన్ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రెండవ సారి ఎమ్మెల్యేగా ఆ సీటు నుంచి నెగ్గారు. ఆయన తండ్రి దివంగత వైఎస్సార్ 1978లో ఫస్ట్ టైం పులివెందుల నుంచి గెలిచారు. ఆ తరువాత ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో మంత్రిగా మంత్రిగానూ ముఖ్యమంత్రిగానూ అయ్యారు. ఇక ఆయన అనంతరం ఆయన సోదరుడు, సతీమణి కూడా పులివెందుల ఎమ్మెల్యేలు అయ్యారు.

ఇపుడు జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్ ఫ్యామిలీకి వచ్చిన  మెజారిటీలు కూడా చెప్పుకోవాలి. వైఎస్సార్ 2009లో అప్పటికి హయ్యెస్ట్ మెజారిటీగా 68 వేల ఓట్లను సాధిస్తే 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి విజయమ్మ భర్తను మించి 81 వేల ఓట్లకు పైగా మెజారిటీని సాధించారు. ఇక  జగన్ విషయం చూస్తే  ఆయన 2014లో 48  వేల ఓట్ల మెజారిటీతో  గెలిచిన దాని కంటే కూడా 2019లో రికార్డు మెజారిటీని సాధించారు. ఏకంగా తొంబై వేల పై చిలుకు మెజారిటీని సాధించారు. ఇది పులివెందులకే సరికొత్త రికార్డు.

అలాంటి పులివెందుల నుంచి వైఎస్సార్ ఫ్యామిలీని దూరం చేయడం సాధ్యమా అంటే ఇది రాజకీయం కాబట్టి ఏమైనా సాధ్యమే అని చెప్పుకోవాలి. తాజాగా చంద్రబాబు పులివెందుల గురించి సమీక్ష చేస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం గా ఉంటూ జగన్ ఏకంగా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నాడని, ఆలా తొలి సీఎం గా చరిత్ర సృష్టించాడని అన్నారు. బాబాయ్ హత్య గురించి కూడా ఆయన హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

పులివెందుల జగన్ నుంచి లాగేసుకుంటామని కూడా చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పులివెందులలో జగన్ని ఓడించడం టీడీపీకి అయ్యే పనేనా అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పులివెందులతో జగన్ కి రిలేషన్స్ గతంతో పోలిస్తే తగ్గాయని అందుకే బాబు ఈ మాట అనగలుగుతున్నారని అంటున్నారు. పులువెందుల ప్రజలకు వైఎస్సార్ ఫ్యామిలీ మీద విశ్వాస్వం ఉండడానికి కారణం వైఎస్ వివేకానందరెడ్డి. ఎవరి ఎమ్మెల్యే అయినా పులివెందులకు ఆయనే శాశ్వత ఎమ్మెల్యే. అటు అన్న గారు అయినా వదిన గారు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆఖరుకు అన్న కొడుకు జగన్ ఎమ్మెల్యే అయినా పెత్తనం అంతా ఆయనదే.

జనాలు కూడా ఆయన్నే కలిసేవారు. అది ఎన్నికల వేళకు ఎవరు పోటీ చేసినా కలసి వచ్చేది. 2014 నుంచి 2019 దాకా చూస్తే వివేకా వచ్చి వైసీపీలో చేరాక మళ్ళీ పులివెందులలో ఆయన పట్టు అలాగే సాగింది. అయితే జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడినపుడు వివేకా కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు. ఆయన పులివెందులలో పోటీ చేసి ఓడారు కూడా. దానికి కారణం నాడు జగన్ పట్ల సానుభూతి. వెల్లువలా వేవ్. ఆ సమయంలో జగన్ కి దాయాది ఫ్యామిలీ వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కరరెడ్డి ఫ్యామిలీ అండగా నిలిచారు.

అలా వారు పులివెందుల మీద తన ముద్ర వేస్తున్న టైం లో మళ్లీ వివేకా వచ్చి అక్కడ తన పాత పరిచయాలతో స్ట్రాంగ్ గా మారిపోయారు. ఒక విధంగా వివేకా వర్సెస్ దాయాదుల మధ్య వివాదాలకు ఇది ప్రధాన కారణం అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక వివేకా మరణం తరువాత మళ్లీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలదే పెత్తనం అయింది. అయితే వివేకా హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు రావడం స్వయంగా జగన్ సోదరి షర్మిల కూడా సీటు కోసం గొడవలే హత్యకు కారణం అని సీబీఐ కి చెప్పడం జరిగింది.

దీని కంటే ముందు లోకల్ గా ఉన్న పులివెందుల జనాలకు వాస్తవాలు ఏంటో బాగా తెలుసు అని టీడీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా పులివెందులలో అవినాష్ రెడ్డి పెత్తనం చేస్తూ రాజకీయాలు చేయడం వల్ల కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అంటున్నారు. అదే వివేకా ఉంటే కనుక వైఎస్ ఫ్యామిలీకి అది చెక్కు చెదరని కంచుకోట అని చెబుతున్నారు.

దాంతోనే ఇపుడు చంద్రబాబు ధీమాగా పులివెందుల మాది అని అంటున్నారు. ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు. అదేంటి అంటే వివేకా హత్య మీద ఈ రోజుకీ జగన్ సమాధానం చెప్పలేకపోతున్నారని, నైతికంగా ఆయన పతనం అయ్యారని కూడా తీవ్ర విమర్శలు చేశారు. సో పులివెందుల మీద ఈ మధ్య చంద్రబాబు తరచూ చేస్తున్న ప్రకటనలతో ఈ సీటు విషయంలో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News