బాబు బోల్డ్ నెస్ కి తమ్ముళ్ళ షాక్... ?

Update: 2022-03-04 16:30 GMT
మా నాయకుడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకోవడం క్యాడర్ కి అలవాటు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు ఆయనే తన గురించి చాలా చెప్పుకుంటారు. ఇక కార్యకర్తలు అయితే మా బాబు అపర చాణక్యుడు అని తెగ మురిసిపోతారు. అయితే బాబు చెప్పాలని చెప్పారా లేక అందులో కూడా వేరే వ్యూహాలు ఉన్నాయా అన్నది తెలియదు కానీ ఫస్ట్ టైమ్ బోల్డ్ గా బాబు మాట్లాడేశారు. తాను ఏమీ కానని, తనకు ఏమీ చేతకావని తమ్ముళ్ల సాక్షిగా ఒప్పేసుకున్నారు.

దాంతో ప్రతీ దానికీ  మా బాబే అని ఎంతో చెప్పుకునే క్యాడర్ ఈ కామెంట్స్ తో  డీలా పడుతోంది. నిజానికి బాబు ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే గత మూడేళ్ళుగా ప్రతీ దాని మీద చంద్రబాబునే అధికార వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఏ పని జరగకపోయినా, లేక ఏది అడ్డంకి వచ్చినా కూడా దాన్ని బాబు మీదనే తోసేస్తోంది.

ఇన్నాళ్ళూ చంద్రబాబు భరించారు, ఇలాంటి ఆరోపణలను సహించారు. కానీ ఎందుకో ఇపుడు మాత్రం ఆయన తట్టుకోలేకపోయారులా ఉంది. అందుకే నాకే అంత శక్తి ఉంటే అసలు నీవు గద్దెనెక్కెవాడివా జగనూ అంటూ నిప్పులే చెరిగారు.

ఈ సందర్భంగా బాబు తనకు తిమ్మిని బమ్మిని చేసే  టాలెంట్ ఏదీ లేదని బోల్డ్ గా చెప్పేసుకున్నారు. జగన్ లా ధైర్యం లేదని, ఆయన తెలివే వేరు అంటూ సొంత బాబాయ్ హత్య మీద సెటైర్లు వేశారు.  నేను కూడా అందరి లాంటి లీడర్ నే అని తానే అనేసుకున్నారు. ఒక విధంగా చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తారని, అవతల పక్షం వ్యూహాన్ని ముందే పసిగట్టి ప్రతివ్యూహం వేస్తారని అంతా  అనే మాట. ఇక బాబుకు అన్ని వ్యవస్థలతో  మంచి పలుకుబడి పరిచయం ఉందని కూడా అంటారు.

ఇది ఆరోపణల కంటే కూడా ప్రశంసలుగానే ఇంతకాలం తమ్ముళ్లు స్వీకరించారు. కాబట్టే వారు కూడా పెద్దగా ఏమీ అనకుండా దాన్నే ఎంజాయ్ చేశారు. చంద్రబాబు సైతం ఏనాడూ తాను ఫలానా విషయంలో మ్యానేజ్ చేశాను అని ఎలా  అంటున్నారు, అది తప్పు అని బయటపడి ఎక్కడా చెప్పలేదు. అయితే అది కాస్తా శృతి మించి ఆఖరుకు ఎంతదాకా వెళ్ళిందంటే చంద్రబాబే ఏకంగా వైఎస్ వివేకా హత్య వెనక ఉన్నారు అనేంతలా.

దాంతో ఇక ఆయన ఓపిక పట్టలేకపోయారులా ఉంది. ఆ విషయం ఈ విషయమూ అన్నీ కలిపి చెప్పేస్తూ నాకు అంతటి   టాలెంట్ లేదండి అని ఒప్పేసుకున్నారు. ఒక విధంగా వైసీపీకి రిటార్ట్ అన్నట్లుగా చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేసినా బాబు ఫార్టీ యియర్స్ పాలిటిక్స్ చూసిన వారు ఎవరూ ఆయన ఇలా అంటారు అని భావించి ఉండరు. తప్పు అయినా ఒప్పు అయినా విమర్శలను కూడా ప్రశంసలుగా భావిస్తూ బాబు ఇంతకాలం పాలిటిక్స్ చేస్తూ వచ్చారు.

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బాబు వ్యూహరచనలో దిట్ట. కానీ ఆయనే అన్నీ చేయించేస్తున్నారు అని మితిమీరిన విమర్శలకు వైసీపీ వారు దిగడంతోనే బాబులోని అసలు మనిషి బయటకు రావాల్సి వచ్చింది అంటున్నారు.

ఏది ఏమైనా బాబు వ్యూహాలు ఈ మధ్యన  ఎదురు తంతున్నాయి అని మూడేళ్ళుగా టీడీపీలో  మరో రకమైన చర్చ సాగుతోంది. దానికి తగినట్లుగానే బాబు నాకు  అన్ని  తెలివితేటలు లేవండీ అని తానే అనేశారు. అయినా సరే మా బాబు గ్రేట్ అని ఎపుడూ అనుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యే క్యాడర్ కి మాత్రం ఆయన బోల్డ్ నెస్ షాకిస్తోందిట. అదే సమయంలో సీనియర్లు మాత్రం బాబు కామెంట్స్ నిశితంగానే పరిశీలిస్తున్నారు.
Tags:    

Similar News