నాపై 21 కేసులు పెట్టి ఏం పీకారు?: జగన్‌పై నారా లోకేష్‌ ఫైర్‌

Update: 2022-05-23 09:30 GMT
తనపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం 21 కేసులు పెట్టిందని.. అయినా ఏం పీకగలిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. ఏపీలో జగన్‌ తాత వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన 55 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనా ఎన్నో కేసులు పెట్టారని.. అయినా ఏం పీకలేకపోయార న్నారు.

తాజాగా మే 23న నారా లోకేష్‌ విజయవాడలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. 2020లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేసినప్పుడు ఆయనకు మద్దతుగా నారా లోకేష్‌ కోర్టుకు వచ్చారు.

అప్పట్లో దీనికి సంబంధించి నారా లోకేష్‌ కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై జగన్‌ ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. నాడు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్‌ హల్‌చల్‌ చేశారని.. తద్వారా కోవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యారని పోలీసులు ఆయనపై కేసు పెట్టారు.

ఆ కేసు విచారణ సందర్భంగా మే 23న నారా లోకేష్‌ విజయవాడ కోర్టులో హాజరయ్యారు. టీడీపీ నేతలపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని.. అందుకే ఇలా తప్పుడు కేసులు పెట్టి తమను కోర్టుల చుట్టూ తిప్పుతూ.. పైశాచికానందం పొందుతున్నారని లోకేష్‌ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

కాగా లోకేష్‌ కోర్టుకు హాజరయిన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయనతోపాటు రావడానికి ప్రయత్నించిన టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులకు ఎక్కడికక్కడే దిగ్బంధించారు. రోడ్లను మూసివేసి టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో లోకేష్‌తో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మరికొంతమంది మాత్రమే రాగలిగారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. లోకేష్‌కు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని తీవ్రంగా హెచ్చరించారు.

మరోవైపు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న జగన్‌ ప్రభుత్వం చివరకు తమకు ఓట్లేసి గెలిపించిన దళితులను కూడా వేధిస్తోందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపైనా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే తనపై 21 కేసులు పెట్టడమే కాకుండా.. కోవిడ్‌ నిబంధనల పేరుతోనూ కేసు పెట్టిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో తమ పోరాటం ఆపబోమని చెప్పారు.
Tags:    

Similar News