పవన్, జగన్ లపై లోకేష్ కామెంట్స్ ఇవి!

Update: 2016-10-20 05:38 GMT
ఇష్టమైనవాళ్లు ఏది చేసినా ఇష్టంగానే అనిపిస్తుంది, సమర్ధనీయంగానే ఉంటుంది.. ఇష్టంలేనివాళ్లు ఏది చేసినా అయిష్టంగానే తోస్తుంది, విమర్శించాలనిపిస్తుంటుంది. ఇష్టాలు, అయిష్టాల సంగతి కాసేపు పక్కనపెడితే భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ విషయంలో పవన్ ప్రశ్నించారు, జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయంలో ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్... ఈ విషయంపై ప్రభుత్వాన్ని తనదైన స్టైల్లో సున్నితంగా ప్రశ్నిస్తూనే, కొన్ని సూచనలు చేశారు. అనంతరం వాటినే కాస్త అటు ఇటుగా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి చెబుతూ, పవన్ సూచనలను పరిగణలోకి తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చారు. ఇందులో దాగిఉన్న రాజకీయాల సంగతి కాసేపు పక్కనపెడితే వాస్తవంగా జరిగిందది!!

ఇదే సమయంలో తాజాగా వైకాపా అధినేత జగన్ తుందుర్రులో పర్యటించారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధితుల తరుపున ఒక సభ పెట్టి చంద్రబాబుని ఏకిపారేశారు.  ప్రజలు ఒప్పుకోకపోయినా బందరు పోర్టుకు వేల ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారని.. అమరావతిలోనూ, భోగాపురం విమానాశ్రయానికి బలవంతంగా భూములు లాక్కుంటారని.. ఇప్పుడు తాజాగా తుందుర్రులో కనీసం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చేసారని విరుచుకుపడ్డారు. గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి పోలీసు వేధింపులకు దిగుతున్నారని, ఈ విషయంలో తాను బాధితులకు అండగా ఉంటానని జగన్ ప్రకటించారు. ఇది ఆక్వాఫుడ్ పార్క్ బాధితుల విషయంలో జనసేన అధినేత పవన్, వైకాపా అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజల తరుపున చేసిన పోరాటం, ప్రభుత్వాన్ని నిలదీసిన క్రమం!

ఈ విషయంలో ఎవరి స్టైల్లో వారు దాదాపుగా ప్రభుత్వానికి సూచనలు చేశారు, కొన్ని సందర్భాల్లో విమర్శలకూ దిగారు. అయితే వీరిద్దరి మాటలకూ తనదైన భావానువాదం చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్! రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని పవన్ అన్నారని.. పవన్ కల్యాణ్ అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. పవన్ కళ్యాణ్ ఓ పార్టీ పెట్టుకున్నారని, ఆయన సమస్యల పైన మాట్లాడవచ్చునని చెప్పారు. అందులో ఎలాంటి తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో... అక్వా ఫుడ్ పార్క్ విషయంలో ప్రజలను జగన్ ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారని చెబుతున్నారు.

అయితే ఇక్కడ పార్టీలకతీతంగా సామాన్యుడిని తొలిచేస్తోన్న ప్రశ్న ఒక్కటే. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కంటే కాస్త తక్కువ శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది వైకాపా. ఈ విషయంలో ప్రజల జగన్ కు భారీగా బాధ్యతలు అప్పగించారు. తమతరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ప్రస్తుతం జగన్ చేస్తోంది కూడా అదే! గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిందే అదే! అయితే అధికారికంగా ఆ అధికారం ఉన్న జగన్ ప్రజల తరుపున పోరాడితే అభివృద్ధి నిరోధకుడు... పార్టీ పెట్టానని చెప్పి అప్పుడప్పుడూ తనదైన స్టైల్లో మాట్లాడి, చంద్రబాబు కు ఏమాత్రం నొప్పి తగలకుండా సన్నాయి నొక్కులు నొక్కుతారనే విమర్శను ఎదుర్కొంటున్న పవన్ సమస్యలపై మాట్లాడటానికి అర్హుడు! లోకేష్ బాబు చెప్పిన ఈ లాజిక్కే జనాలకు అర్ధం అవ్వడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జగన్ వాదన్లో బలం లేదని - తుందుర్రులో అలాంటివేమీ జరగడం లేదని, ప్రజలు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, లేక ప్రజలు చాలావరకూ ఆ పార్క్ కి స్వచ్చందంగా స్వాగతం పలికారని, ఇప్పుడు ధర్నాలు చేస్తోన్న వారంతా వైకాపా కార్యకర్తలనీ - వారిని వైకాపా అధినేతే కావాలని రెచ్చగొడుతున్నారని, ఆక్వా పార్క్ అంతా పర్యావరణాన్ని - ప్రజల పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే చేపట్టామని చెప్పుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయాలపై కాకుండా, ఆ విషయాలపై మాట్లాడిన వారినందరినీ అభివృద్ధి నిరోధకులని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది ఇప్పటికి సమర్ధించుకున్నట్లు అనిపించినా... ప్రజలు ఆ స్థాయిలో మీడియా ముందుకొచ్చి గొంతెత్తి పోరాడుతున్నప్పుడు ఒకవర్గం మీడియాకు కళ్లు మసకబారినా - మాట్లాడాల్సిన బాధ్యతున్న వారైనా మాట్లాడకపోతే ఎలా అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి ఎదురవుతున్నాయనే చెప్పాలి!! ఈ విషయంలో మరింత మెచ్యూరిటీతో ప్రభుత్వం తరుపున మాట్లాడేవారు స్పందిస్తే బాగుటుందనేది మరికొందరి అభిప్రాయంగా ఉంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News