ఏపీ అంటే జగన్ కు అంత వ్యతిరేకతా?

Update: 2016-06-06 07:29 GMT
 ఒకరేమో విపక్ష నేత.. ఇంకొకరమే ముఖ్యమంత్రి తనయుడు. ఈ ఇద్దరు యువనేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అయితే... విపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తుంటే, చంద్రబాబు తనయుడు లోకేశ్ తండ్రికి మద్దతుగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు. నవ్యాంధ్రప్రదేశ్ కు జగన్ వ్యతిరేకని ఆరోపించారు. వైసీపీ ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీ అంటూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఘటనలు చూస్తే జగన్ వ్యవహారామేంటో అర్థమైపోతుందని అన్నారు.  జగన్ వంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టమంటూ విరుచుకుపడ్డారు.

అదేసమయంలో టీడీపీ శ్రేణులకు కూడా ఆయన పలు సూచనలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు - ఆ పార్టీ నేతలు ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని.. సంయమనం పాటించాలని సూచించారు. అనవసరమైన వ్యక్తుల కామెంట్లకు రెస్పాండ్ కాకుండా ఆ సమయాన్ని రాష్ర్టాభివృద్ధిపై పెట్టాలని సూచించారు.

మరోవైపు టీడీపీలోని మిగతా నేతలు కూడా జగన్ వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానమిస్తున్నారు. చంద్రబాబును టార్గెట్ చేసి జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ మాత్రమే కాకుండా ఆయన తండ్రి - తాత కూడా నేరగాళ్లేనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేత ఆనం వివేకానందరెడ్డి తదితరులూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు నేతలైతే జగన్ ను రక్తం తాగే రాక్షసుడిగా అభివర్ణించారు. మొత్తానికి పార్టీ నేతలను సంయమనం పాటించాలని కోరుతున్నా కూడా ఎవరూ ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి.
Tags:    

Similar News