ఏపీ టీడీపీకి ఆఫీసు కష్టాలు

Update: 2016-01-25 07:21 GMT
 తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రలో కొత్త కష్టాన్ని ఎదుర్కొంటోంది. ఇంతకాలం సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఆ పార్టీ ఇప్పుడు పాలన నవ్యాంధ్రకు మారుతుండడంతో అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే... ఇది తాత్కాలిక కార్యాలయమే. కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయాన్నే రాష్ట్ర కార్యాలయంగా మార్చుకున్నా అది ఏ మూలకూ చాలడం లేదట. పార్టీలో ఎవరైనా నాయకులు చేరినా ఆ కార్యక్రమాన్ని ఈ పార్టీ కార్యాలయంలో నిర్వహించే స్థలం లేదు. దీంతో ప్రైవేటు హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో ఈ కార్యక్రమాలను చేయవలసి వస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడైనా జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బందులు ఎదురువుతున్నాయి.

అన్ని సౌకర్యాలున్న హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ భవన్‌ కి అలావాటుపడిన నేతలకు ఇప్పుడు చిన్న కార్యాలయంలో ఉండాల్సి రావడం ఇబ్బందిగా మారింది. విజయవాడకు ఇతర జిల్లాల నేతలు వచ్చినా పార్టీ కార్యాలయానికి వచ్చి ఉండేంత స్థలం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్యాలయం కోసం ఏపీ టిడిపి వెతుకుతోంది. దీనిపై నారా లోకేష్ కూడా దృష్టి సారించారు. అందుకే మంగళగిరి సమీపంలో ఇప్పటికే నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించి, దానిని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ స్థలం కేటాయిస్తే వెంటనే రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ఆలోచనతో ఏపీ తెలుగుదేశం పార్టీ ఉంది. భవన నమూనా కూడా సిద్దం చేశారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ముగిశాక నారా లోకేశ్‌ విజయవాడ పార్టీ కార్యాలయానికి వెళ్లి, దీనిపై చర్చించనున్నారు. అంటే గ్రేటర్ ఎన్నికలు ముగిశాక కార్యాలయ నిర్మాణంపై క్లారిటీ వస్తే విశాలమైన కార్యాలయం ఏర్పడి ఏపీ టీడీపీ ఇరుకు గదుల నుంచి స్వేచ్ఛావాతావరణంలోకి మారబోతుందన్నమాట.
Tags:    

Similar News