తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తామని ప్రకటనలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు పెద్ద షాక్ నిచ్చాయనే సంగతి తెలిసిందే. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని - ఆంధ్రప్రాంతం నుంచి పార్టీని నడుపటం సాధ్యం కాదని - టీఆర్ ఎస్ లో విలీనంచేయాలని ప్రకటించి కలకలం సృష్టించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు వస్తే బాగుండేదని, కానీ రాకపోవడంవల్ల కొంత నైరాశ్యం నెలకొంది అని పార్టీ అధినేతను టార్గెట్ చేస్తూ మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ప్రతిసారి నాయకులు విజయవాడకు వెళ్లడం - అక్కడ నిర్ణయాలు తీసుకోవడం - ఇక్కడ అమలుచేయడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా పనిచేస్తున్నా తగిన గుర్తింపులేదని కార్యకర్తలు పార్టీని వీడి రాజకీయ భవిష్యత్‌ను వెదుక్కుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న పార్టీని భుజానవేసుకుని కాపాడుదామన్నా ఏ నాయకుడూ సహకరించే పరిస్థితి లేదని మోత్కుపల్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. రాష్ట్రంలో కుంచించుకుపోతున్నదని, పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేదని, ఇక తెలంగాణలో పార్టీ ఉండదేమోనని బాధగా ఉన్నదని చెప్పారు.
మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు - ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. కలెక్టర్ల సదస్సు ఉండడం వల్లనే తమ పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని ఎన్ టిఆర్ ఘాట్ కు వెళ్లలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఎన్ టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించామని ఆయన చెప్పారు. ఇక్కడ జరిగిన వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారని ఆయన చెప్పారు. అమరావతిలో ఎన్ టీఆర్ విగ్రహం ఏర్పాటుకు - ఎన్ టిఆర్ మెమోరియల్ నిర్మాణానికి డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని ఆయన తెలిపారు. క్యాడర్ నుంచే లీడర్లను తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తద్వారా పార్టీ నుంచి ఏ నాయకుడు వెళ్లిపోతున్న సమయంలో అయినా...చెప్పే మాటలనే చెప్పారు!
ఇదిలాఉండగా..మోత్కుపల్లి నర్సింహులు కామెంట్లను రాజకీయ వర్గాలు ఆసక్తికర రీతిలో విశ్లేషిస్తున్నారు. ఇది చంద్రబాబు వైఫల్యంగా కొందరు నేతలు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి పార్టీలో ఉన్న టీడీపీ నాయకులు పార్టీ మారడమే కాకుండా పార్టీలోని నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతున్నారని అంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీ మారి వెళ్లిపోతున్నారు. చంద్రబాబు ఎన్నిరకాలుగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నా వలసలు మాత్రం ఆగడంలేదని.. ఇందుకు తెలుగుదేశం పార్టీ మనుగడ - తమ రాజకీయ భవిష్యత్ పై ఉన్న బెంగే కారణమని అంటున్నారు.