ట్వీట్ ఆరోపణలతో మరీ బరితెగింపు ఏంది లోకేశా?

Update: 2020-01-29 05:24 GMT
దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణపై ఆయన కుమార్తె సునీత సందేహాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన తండ్రి హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె కొన్నిపేర్లును కోర్టుకు జాబితాగా ఇవ్వటమే కాదు.. తానెందుకు వారిని అనుమానిస్తున్నానన్న వివరాల్ని పేర్కొన్నారు.

సందు కనిపిస్తే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయాలని ఎదురుచూసే నారా లోకేశ్ తాజా పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ పరపతిని దెబ్బ తీసేందుకు వీలుగా ఆయన బరి తెగింపు ట్వీట్ ఆరోపణల్ని సంధించారు.

హైకోర్టును ఆశ్రయించిన సునీత పిటీషన్ ను అడ్డు పెట్టుకొని అవాకులు చవాకులు పేలుతూ లోకేశ్ వరుస ట్వీట్లు పోస్టు చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయటం జరిగిందని.. ఆ హత్యను జగన్ రాజకీయ లబ్థి కోసం వాడుకున్నట్లుగా పేర్కొన్నారు. జగన్ శవ రాజకీయం వైఎస్ కుటుంబ సభ్యులకు అర్థమైందని ఆయన ఆరోపించారు. ఈ ట్వీట్ నే తీసుకుంటే.. వైఎస్ వివేకా హత్యను తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ వాడుకున్నది లేదు.  ఆ మాటకు వస్తే.. బాబు పాలనపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండి.. జగన్ కు పట్టం కట్టే విషయాన్ని నివేదికలు స్పష్టంగా చెబుతున్న వేళ.. వివేక హత్యతో డ్రామా ఆడాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న.

వివేక హత్య విషయాన్ని జగన్ మొదట్నించి రాజకీయం చేసింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా లోకేశ్ ట్వీట్లు ఉన్నాయి. వాస్తవాలు తెలుసుకొని వివేక్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ చెల్లెలు హైకోర్టులో పిటిషన్ వేసే పరిస్థితి వచ్చిందని లోకేశ్ ట్వీట్ చేశారు. సీఎం కుర్చీ కోసం జగన్ బాబు మీద అనేక ఆరోపణలు చేసినట్లుగా పేర్కొన్నారు.

తన బాబాయ్ ను హత్య చేయించింది బాబేనని.. కేసును సీబీఐని అప్పగించాలంటూ మొసలి కన్నీరు కార్చి.. తీరా అధికారంలోకి వచ్చాక సీబీఐ అవసరం లేదని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారన్నది లోకేశ్ వారి ట్వీట్ ఉవాచ. అదే నిజమని అనుకుందాం? మరి.. ఆ విషయాన్ని ఇంతకాలం బాబు అండ్ కో ఎందుకు ప్రశ్నించలేదు? భారీ సభ పెట్టి.. వివేకా హత్య విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎందుకు ఫైట్ చేయలేదు? అన్న ప్రశ్నకు లోకేశ్ సమాదానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కుట్రలు ఎన్ని జరిగినా న్యాయపోరాటం చేస్తున్న జగన్ చెల్లులు కారణంగా అసలు నిజాలు బయటకు వస్తాయని లోకేశ్ ట్వీట్ చేశారు. అయినా.. జగన్ సోదరి పోరాడితేనే అసలు నిజాలు బయటకు రావటం ఏమిటి? వివేక హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది బాబు.. చినబాబే.నిజంగా ఏదో కుట్ర ఉందన్నదే నిజమైతే.. ఆ నిజాల్ని అప్పట్లో అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు బయటపెట్టనట్లు? అన్న ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News