తొలితరం జాతీయ నాయకుల్లో ఒకరైన గొప్ప రాజనీతిజ్ఞుడిని జాతి కోల్పోయింది. అత్యుత్తమ పార్లమెంటేరియన్ - మానవతావాది - జాతీయవాది - భారతరత్న పురస్కార గ్రహీత - మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (93) మహాభినిష్క్రమణం చెందారు. గెలుపోటముల భయమే లేని నేత.. ఏ పరిస్థితుల్లోనూ ఎవరినీ ఏదీ కోరుకోకుండా.. కర్తవ్యదీక్షలో లభించిందే చాలనుకొన్న తాత్తిక రాజకీయవేత్త.. తనకు లభించిన గౌరవాన్ని - అభిమానాన్ని పొదివిపట్టుకుని దిగంతాలకేగారు. జాతీయత - మానవత - ఉదాత్తత కలగలిసిన అజాతశత్రువు.. సెలవుపలికారు. అయితే, ఈ పరిణామాన్ని ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ వాడుకున్నారు. తద్వారా సోషల్ మీడియా వేదికగా నవ్వులపాలు అయ్యారు.
రాజకీయ భీష్ముడిగా పేరున్న మాజీ ప్రధాని - భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్ పేయి కన్నుమూశారు. 93ఏండ్లు వయస్సున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ నేతలు సంతాపం తెలిపారు. ఇదే జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా సంతాపం తెలిపారు. అయితే, ఇందులో సంతాపంతో పాటు తన తండ్రిని కీర్తించేందుకు లోకేష్ ప్రయత్నించారు. తద్వారా నవ్వుల పాలయ్యారు.
``భారతమాత రాజకీయాల్లోనూ - దౌత్యం - సాహిత్యతంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆశయాలను సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఒక సన్నిహితుడిని తెలుగు రాష్ర్టాలు కోల్పోయాయి. మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం సర్ అటల్ బిహారీ వాజ్ పేయి గారు`` అని లోకేష్ ట్వీట్ చేశారు. సంతాపంలో కూడా చంద్రబాబు పేరును జొప్పించడం, ఆయనకు భుజకీర్తులు ఆపాదించడం చూసి పలువురు నవ్వుకున్నారు. ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడసారి వీడ్కోలు పర్వంలో కూడా మీ తండ్రిని కీర్తించడం ఏంటని కొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే, అనంతరం..ఎప్పట్లాగే...ఈ ట్వీట్ ను లోకేష్ డెలిట్ చేశారు! చంద్రబాబు పేరు లేకుండా పోస్ట్ మరో ట్వీట్ చేశారు.