నవాజ్ నోట కాశ్మీర్ మాట వస్తే.. మోడీ ఫైరింగేనా?

Update: 2015-09-25 07:12 GMT
అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించటం పాకిస్థాన్ కు కొత్తేం కాదు. కాశ్మీర్ భారత్ లో భాగమైనా దాన్నో బూచిలా చూపించటం.. గత పాలకుల నిర్లక్ష్యం చేతకానితనం పుణ్యమా అని.. కాశ్మీర్ అంశం ఒక వివాదాస్పద అంశంగా మారటం తెలిసిందే. నిజానికి కాశ్మీర్ గురించి పాక్ ప్రస్తావించిన వెంటనే.. అక్రమిత కాశ్మీర్ గురించి ప్రస్తావించి.. దాన్ని భారత్ లో ఎందుకు కలపటం లేదన్న విషయాన్ని తెర మీద తీసుకురావటం.. పాక్ అక్రమిత కాశ్మీర్ మీద భారత్ కున్న హక్కుల గురించి రివర్స్ గేర్ లో రియాక్ట్ అయితే బాగుండేది.

కానీ.. అలాంటిదేమీ లేకపోవటంతో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం.. లాంటి వేదికల మీద పాక్ చిల్లరగా వ్యవహరించటం తెలిసిందే. గత ఏడాది సమావేశాల్లో ఇలానే ప్రస్తావించటం మోడీ కాస్తంత ఘాటుగా స్పందించటం తెలసిందే.

మరి.. ఈసారి సమావేశాల్లో కూడా పాక్ తన బుద్దిని మార్చుకోకుండా.. కాశ్మీర్ ఇష్యూను తెర మీదకు తెస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయాన్ని విదేశాంగ శాఖను అడిగితే.. వారి కాస్తంత భిన్నంగా స్పందిస్తున్నారు. ముందు పాక్ నోటి నుంచి కాశ్మీర్ అన్న మాట రానివ్వనీయండి.. ఆ తర్వాత చెబుతాం అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

చూస్తుంటే.. ఈసారి కానీ ఐక్యరాజ్య సమితి సమావేశ వేదిక మీద ప్రసంగించే సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కానీ కాశ్మీర్ అంశం ఎత్తితే.. మోడీ సమాధానం కాస్త తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతుంది. మరి.. అంత ధైర్యంగా మోడీ రియాక్ట్ అవుతారా? లేదా? అన్నది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే తేలిపోతుంది.
Tags:    

Similar News