పోల‌వ‌రంపై మోడీ గేమ్ ప్లాన్ ఇదేనా?

Update: 2017-12-02 04:51 GMT
ఏది ఏమైనా.. ఏం జ‌రిగినా.. 2018 చివ‌రి నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును ఎంతో కొంత  పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఈ ప్రాజెక్టు కోసం  బాబు ఎంత‌వ‌ర‌కు వెళ్లారంటే.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్ప‌టికీ రాష్ట్ర ఖ‌జానా నుంచి రూ.4వేల కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌టం చూస్తే.. ఈ ప్రాజెక్టును బాబు ఎంత వ్య‌క్తిగ‌తంగా తీసుకున్నారో అర్థ‌మ‌వుతుంది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని చూపించ‌టానికి ఏమీ ఉండ‌ద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి స‌చివాల‌యంతో స‌హా కీల‌క భ‌వ‌నాల‌కు సంబంధించిన డిజైన్లు ఖ‌రారు కాక‌పోవ‌టమే ఇందుకు నిద‌ర్శ‌నం. ఒక‌వేళ‌.. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో డిజైన్లు ఖ‌రారైనా.. అంత భారీ భ‌వ‌నాలు పూర్తి కావ‌టం ఏడాదిలో సాధ్యం కాదు. అంటే.. 2019 సార్వ‌త్రికానికి ఏపీ రాజ‌ధాని ఏ ర‌కంగానూ బాబుకు అక్క‌ర‌కు రాదు. ఐదేళ్ల‌లో ఏం పీకావ్ బాబు అని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నించిన‌ప్పుడు.. ప‌ట్టిసీమ‌.. పోల‌వ‌రం ప్రాజెక్టులు చేశామ‌ని చెప్పుకునే అవ‌కాశం ఉండాలి. లేదంటే.. రాజ‌కీయంగా బాబు ఇబ్బంది ప‌డ‌తారు.

రికార్డు స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేశార‌న్న ప్ర‌చారం బాబుకు ఎంత లాభం చేస్తుందో తెలిసిందే. అందుకే.. ఆర్థిక ఇబ్బందుల‌తో కిందామీదా ప‌డుతున్న వేళ‌లోనూ.. మాట విన‌ని మోడీ ఇచ్చే నిధుల కోసం వెయిట్ చేయ‌కుండా రాష్ట్ర నిధుల‌ను కూడా వాడుతున్నార‌ని చెప్పాలి.

మ‌రింత వేగంగా ప‌నులు చేయిస్తున్న బాబు వ్యూహం ఏమిటో తెలీనంత పిచ్చోడు కాదు ప్ర‌ధాని మోడీ. సొమ్ము ఒక‌డిది.. షోకు మ‌రొక‌డ‌దంటే మోడీ మాష్టారు లాంటోళ్లు ఒప్పుకుంటారా?  అందుకే.. దిమ్మ తిరిగే వ్యూహం ఒక‌టి సిద్ధం చేశారు. ఒక దెబ్బ‌కు రెండు..మూడు పిట్ట‌ల‌న్న చందంగా ఆయ‌న ప్లాన్ రెఢీ చేశార‌ని చెప్పాలి.

పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయితే లాభం టీడీపీకి.. మైలేజీ బాబుకు. అదే పూర్తి కాక‌పోతే..? ఇదే ప్ర‌శ్న.. మోడీ తాజా వ్యూహంగా చెబుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ గాలి భారీగా వీచే అవ‌కాశం త‌క్కువ‌న్న అభిప్రాయం ఈ మ‌ధ్య‌న బ‌లంగా వినిపిస్తోంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు గ్రాండ్ స‌క్సెస్ అయిన‌ట్లు క‌నిపించినా..ఎప్పుడైతే జీఎస్టీ వ‌చ్చిందో.. ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మార‌ట‌మే కాదు.. గ‌డిచిన మూడున్న‌రేళ్లలో మోడీ సంపాదించుకున్న ఇమేజ్ అంతా పాడైంది. దీంతో.. అలెర్ట్ అయిన మోడీ స‌ర్కార్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

అదే స‌మ‌యంలో భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న అంశంపై వాస్త‌విక కోణంలో ఆలోచించ‌టం మొద‌లెట్టింది. 2014 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన‌న్ని సీట్లు సొంతంగా తాము సాధించ‌టం క‌ష్టమ‌న్న విష‌యాన్ని మోడీ బ్యాచ్ అర్థం చేసుకుంద‌ని చెబుతారు. అందుకే.. ఇప్ప‌టికి ఉన్న మిత్రుల‌తో పాటు.. అద‌నంగా కొంద‌రు మిత్రుల్ని మ‌చ్చిక చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ అండ్ కో ఉంద‌ని చెబుతారు. ఇదే.. త‌మిళ‌నాడు డీఎంకే అధినేత క‌రుణ ఇంటికి మోడీ వెళ్ల‌టం.. పెద్దాయ‌న భుజం మీద చేయి వేసి మ‌రీ.. ఢిల్లీలోని మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించ‌టం లాంటివి చెప్పాలి. ద‌క్షిణాది మీద బ‌ల‌మైన పార్టీల‌కు గాలం వేస్తున్న మోడీ.. ప్ర‌జ‌ల్లో తిరుగులేని ఆద‌ర‌ణ ఉన్న కొన్ని రాష్ట్రాల్ని ఫ్యూచ‌ర్ ఫ్రెండ్ షిప్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇలాంటి భ‌విష్య‌త్తు మిత్రుల్లో త‌మిళ‌నాడు డీఎంకే.. తెలంగాణ టీఆర్ ఎస్‌.. ఒడిశా న‌వీన్ పట్నాయక్  లాంటి వాళ్లు ఉన్నారు. కొత్త మిత్రుల కోసం పాత మిత్రుల్ని మోడీ వ‌దులుకుంటారా? అంటే లేద‌నే చెప్పాలి.  ఏపీ అధికార‌ప‌క్షం సంగ‌తే చూసుకుందాం.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోడీకి మించిన ప్ర‌త్యామ్నాయం బాబుకు లేదు. ఆ విష‌యం బాబుకే కాదు మోడీకి కూడా తెలుసు. అందుకే.. అవ‌క‌త‌వ‌క‌లు.. రూల్స్ ను బ్రేక్ చేస్తూ పోల‌వ‌రం ప్రాజెక్టును రూపొందిస్తున్నారన్న మాట‌లు చెప్పి పోల‌వ‌రం ప్రాజెక్టుకు మోకాల‌డ్డుతున్నారు. ఇక్క‌డ మోడీ ఆడేదంతా తొండి ఆట అన‌టానికి కూడా లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం విష‌యంలో బాబు కొన్ని త‌ప్పులు చేశార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. పోల‌వ‌రం పూర్తి కావ‌ట‌మే ల‌క్ష్యం త‌ప్పించి.. కొన్ని విష‌యాల్ని ప‌ట్టించుకోకూడ‌ద‌న్న భావ‌న‌లో బాబు ఉన్న‌ట్లు చెబుతారు.

అదే జ‌రిగితే.. అంతిమంగా న‌ష్ట‌పోయేది మోడీనే. ఎందుకంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టుతో ఎఫెక్ట్ అయ్యేరాష్ట్రాల్లో ఒడిశా.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. కొంత‌మేర తెలంగాణ ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల మీద మోడీ బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఏపీ కోసం మూడు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల్ని వ‌దులుకోవ‌ట‌మా.. లేక బాబు స్పీడ్‌ కు బ్రేకులు వేసి.. మూడు రాష్ట్రాల‌ను త‌న వైపు తిప్పుకోవ‌ట‌మా? అన్న ద‌గ్గ‌ర‌.. రెండో విధానానికి మోడీ పిక్స్ అయ్యార‌ని చెబుతున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును ఆపివేయ‌టం కాకుండా.. నిర్మాణంలో ఆల‌స్యం చేయ‌ట‌మే మోడీ స‌ర్కారు అంత‌రంగంగా చెబుతున్నారు. పోల‌వ‌రానికి బ్రేకులు వేయ‌టం ద్వారా బాబును కంట్రోల్ చేయ‌టంతో పాటు.. త‌న చుట్టూ తిప్పుకునేలా చేయ‌టంతో పాటు.. కొత్త మిత్రుల‌తో చెలిమికి అవ‌కాశాల్ని స‌జీవంగా ఉంచుకోవ‌టంలో భాగంగానే తాజా ప‌రిణామాలకు కార‌ణ‌మ‌న్న వాద‌న   వినిపిస్తోంది. రాజ‌కీయం అన్నాక‌.. లాభ న‌ష్టాల లెక్క‌లే కీల‌కం క‌దా.
Tags:    

Similar News