త‌న‌కేమైనా జ‌రిగితే మోదీదే బాధ్య‌తంటున్న పెద్దాయ‌న‌!

Update: 2019-02-03 08:16 GMT
అవినీతిపై రాజీ లేని పోరాటంతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు అన్నా హ‌జారే. లోక్ పాల్‌, లోకాయుక్త‌ల కోసం ఆయ‌న అలుపెరుగ‌ని కృషి చేశారు. నిరాహార దీక్ష చేప‌ట్టారు. పెద్ద‌యెత్తున ఉద్య‌మం న‌డిపించారు. అన్నా పోరాటంతో కొన్నాళ్ల‌పాటు దిగివ‌చ్చిన‌ట్లు క‌నిపించిన ప్ర‌భుత్వాలు తిరిగి త‌మ బాట‌లోకే వెళ్లిపోయాయి. లోక్ పాల్‌, లోకాయుక్త‌ల‌పై మీన‌మేషాలు లెక్కిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న గ‌త పోరాటం వృథా కాకుండా ఉండేందుకుగాను అన్నా హ‌జారే తిరిగి పోరాట బాట ప‌ట్టారు. లోక్ పాల్‌, లోకాయుక్త‌ల‌ను వెంట‌నే ఏర్పాటుచేయాల‌ని డిమాండ్ చేస్తూ మ‌హారాష్ట్రలోని త‌న స్వ‌గ్రామం రాలేగావ్ సిద్ధిలో గ‌త నెల 30 నుంచి నిరాహార దీక్ష మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం అన్నా వ‌య‌సు 81 ఏళ్లు. దీక్ష కార‌ణంగా ఆయ‌న ఆరోగ్యం త్వ‌ర‌గా క్షీణిస్తోంది. దీంతో వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌గా దీక్ష విర‌మించాలని కోరుతున్నారు. అన్నా మాత్రం అందుకు స‌సేమిరా అంటున్నారు. లోక్ పాల్, లోకాయుక్త‌ల‌ను ఏర్పాటుచేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారు.

ఆదివారంతో అన్నా దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడారు. త‌న‌కు ఏదైనా జ‌రిగితే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీదే బాధ్య‌త అని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌లు త‌న‌ను అగ్నికి ఆజ్యం పోసిన‌వాడిలా కాకుండా స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేసిన‌వాడిగా గుర్తుపెట్టుకుంటార‌ని అన్నా తెలిపారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో తనకు ఏమైనా జరిగితే ప్రజలు ప్రధాని మోదీనే నిలదీస్తారని అన్నారు. లోక్ పాల్‌, లోకాయుక్తల ను నియమిస్తే ప్రధాని, ముఖ్యమంత్రిల‌పై సైతం అవినీతి ఆరోప‌ణ‌ల కింద విచార‌ణ చేప‌ట్ట‌వ‌చ్చున‌ని తెలిపారు. అందువల్లే రాజ‌కీయ పార్టీలు ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురావడానికి వెనుకంజ వేస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

నిరాహార దీక్ష కార‌ణంగా అన్నా ఆరోగ్యం ఇప్ప‌టికే బాగా క్షీణించిన  నేప‌థ్యంలో ఆయ‌న తాజా వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. నిజంగా ఆయ‌న‌కు ఏమైనా జ‌రిగితే ప్ర‌ధానిపై, కేంద్ర‌ప్ర‌భుత్వంపై దేశ ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌టం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు జోస్యం చెబుతున్నారు. లోక్ పాల్, లోకాయుక్త‌ల ఏర్పాటుపై ఇక‌నైనా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను క‌లుపుకొని కేంద్ర ప్ర‌భుత్వం ముందడుగు వేయాల‌ని.. లేనిప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఎదురుకావొచ్చున‌ని హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News