ఎడ్జ్ బీజేపీకే!... కాంగ్రెస్ ఈ సారీ విప‌క్ష‌మే!

Update: 2019-01-06 14:43 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఐదు నెల‌ల స‌మ‌య‌మే ఉంది. వ‌చ్చే నెల‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ తో పాటు ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అంటే 2014లో మాదిరిగానే 2019 ఎన్నిక‌లు కూడా ఏప్రిల్, మే నెల‌ల్లోనే పూర్తి కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టిదాకా దేశంలోని ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేనంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకుంటోంది. ఇటీవ‌ల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏకంగా మూడు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌డం, అవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావ‌డంతో... ఇక త‌మ‌కు తిరుగులేద‌న్న కోణంలోనే విశ్లేష‌ణ‌లు చేసుకుంటోంది. అయితే వాస్త‌వ ప‌రిస్థితి కాంగ్రెస్ పార్టీ భావ‌న‌కు పూర్తిగా విభిన్నంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ ప‌లు స‌ర్వే సంస్థ‌లు దేశంలోని ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ఫ‌లితాల‌ను వెలువ‌రిస్తున్నాయి.

ఇప్ప‌టిదాకా వెలువ‌డిన ఇలాంటి స‌ర్వేల్లో ఒక్క‌టంటే ఒక్క స‌ర్వేలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మికి సంపూర్ణ మెజారిటీ వ‌చ్చిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. తాజాగా నిన్న వెలువ‌డిన ఓ స‌ర్వేలో కూడా బీజేపీకే ఎడ్జ్ క‌నిపించింది... త‌ప్పించి కాంగ్రెస్ పార్టీ కోలుకున్న ప‌రిస్థితి ఏమీ క‌నిపించ‌లేదు. టీవీ-సీ ఎన్ ఎక్స్ సంస్థ... దేశంలోని మొత్తం 543 పార్ల‌మెంటు స్థానాల‌తో పాటు 1086 స్థానాల్లోని ప్ర‌జ‌ల‌ను ప‌లుక‌రించింది. అంటే మొత్తం దేశంలోని అన్ని లోక్ స‌భ స్థానాల్లోని జ‌నం ప‌ల్స్‌ ను ప‌రిశీలించిన ఆ సంస్థ‌... నిన్న త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఫ‌లితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మికి ఓ మోస్త‌రు సీట్లు ద‌క్కినా కూడా మ్యాజిక్ ఫిగ‌ర్‌ కు చాలా ద‌గ్గ‌ర‌గా నిల‌బ‌డింది. అదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ కూట‌మికి కూడా కాస్తంత సీట్ల సంఖ్య పెరిగినా... అధికారానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన దాఖ‌లా క‌నిపించ‌క‌పోగా... విప‌క్ష స్థానంలో కూర్చోవ‌డం ఖాయ‌మ‌ని కూడా తేల్చేసింది. డిసెంబ‌ర్ 15-25 మ‌ధ్య చేసిన ఈ స‌ర్వే ఫ‌లితాలు ఎలా ఉన్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మికి 257 సీట్లు ల‌భిస్తాయి. అంటే మ్యాజిక్ ఫిగ‌ర్‌ కు ఓ 15 సీట్ల దూరంలో ఎన్డీఏ నిల‌బ‌డుతుంద‌న్న మాట‌.

ఇక ఇటీవ‌లి కాలంలో జరిగిన ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు మొన్న‌టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటామ‌ని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్వ‌ర్యంలోని యూపీఏ కూటమికి మాత్రం ఈ స‌ర్వేలో 146 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ద‌ఫా కూడా విప‌క్షంలోనే కూర్చోక త‌ప్ప‌ద‌న్న మాట‌. ఈ స‌ర్వేలో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసే అంశం కూడా ఒక‌టి ఉంది. బీజేపీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ కు చేరువ‌గా వ‌చ్చినా... ఆ కూట‌మికి మ‌ద్ద‌తుగానో, లేదంటే యూపీఏకు అనుకూలంగానో నిలిచే అవ‌కాశాలున్న త‌ట‌స్థ పార్టీలు ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా 140 సీట్లు కైవసం చేసుకుంటాయ‌ట‌. ఇలా ఏ ఒక్క కూటమికి స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాని నేప‌థ్యంలో కీల‌క భూమిక ఈ పార్టీల‌దే కానుంది. ఇలాంటి పార్టీల జాబితాలో ఏపీలో విప‌క్షంగా ఉన్న వైసీపీతో పాటు తెలంగాణ‌లో అధికార పార్టీగా ఉన్న టీ ఆర్ ఎస్ కూడా ఉన్నాయి. ఈ స‌ర్వేలో వైసీపీకి 19 సీట్లు ద‌క్క‌నున్నాయ‌ని తేల‌గా, టీ ఆర్ ఎస్‌ కు 16 సీట్లు ద‌క్కుతాయ‌ని తేలింది. అంటే... ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీని బీజేపీ త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలుపుకోగ‌లిగితే... చాలా ఈజీగానే మళ్లీ కేంద్రంలో అధికారాన్ని చేప‌ట్ట‌డం ఖాయ‌మే. 

ఇదిలా ఉంటే... ఇదే సంస్థ న‌వంబ‌ర్‌లోనే ఇదే త‌ర‌హా స‌ర్వేను చేసింది. ఈ స‌ర్వేలో కూడా దాదాపుగా ఇవే ఫ‌లితాలు రాగా... డిసెంబ‌ర్ లో జ‌రిగిన స‌ర్వేలో బీజేపీకి 24 సీట్లు త‌గ్గ‌గా... యూపీఏకు 22 సీట్లు మాత్రం పెరిగాయి. మిగిలిన గ‌ణాంకాలు దాదాపుగా ఒకేలా ఉన్నాయ‌ని స‌ద‌రు సంస్థ పేర్కొంది. ఎన్డీఏ కెప్టెన్‌ గా ఉన్న బీజేపీకి సింగిల్ గా 223 సీట్ల‌తో విజ‌యం సాధించే అవ‌కాశాలుండ‌గా, యూపీఏ ర‌థ‌సార‌థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి 85 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని ఆ సర్వే తేల్చింది. మొత్తంగా ఎన్ని స‌ర్వేలు వ‌చ్చినా దాదాపుగా ఇలాంటి ఫ‌లితాల‌నే ప్ర‌క‌టిస్తున్న నేప‌థ్యంలో కేంద్రంలో మ‌రోమారు ఎన్డీఏ స‌ర్కారే కొలువుదీర‌నుంద‌ని తేట‌తెల్లం అవుతున్న‌ది. అదే స‌మ‌యంలో ఎంత‌గా బ‌లం పెంచుకున్నామ‌ని చెప్పుకున్నా... కాంగ్ర‌స్ పార్టీ ఈ సారి కూడా విప‌క్షంలో కూర్చోక త‌ప్ప‌ద‌ని కూడా ఆ స‌ర్వే తేల్చేసింది. అయితే గుడ్డిలో మెల్ల అన్న మాదిరిగా ఈ ద‌ఫా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాకు అవ‌స‌రమైన సీట్ల‌ను మాత్రం ద‌క్కించుకోగ‌ల‌ద‌ని స‌ర్వేలు చెబుత‌న్నాయి.



Full View

Tags:    

Similar News