ఈ మాటను ఎన్నిసార్లు చెబుతారు? చేతల్లో చేసి చూపించండి కేసీఆర్

Update: 2021-06-12 05:31 GMT
కొన్ని విషయాల మీద కీలక ప్రకటన చేయటమే కాదు.. అందుకు తగ్గట్లే.. తాను చెప్పిన పని పూర్తి అయ్యే వరకు విడిచి పెట్టకుండా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. అదే సమయంలో.. మరికొన్ని విషయాల్లో మాత్రం ఆయన మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించుకుందామన్న మాట చెప్పటమే కానీ చేతల్లో చూపించరు. అదే సమయంలో.. అనుకోని రీతిలో ఎన్నికలు వచ్చి పడితే.. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన బహిరంగ సభల్ని ఏర్పాటు చేస్తారు.

అంతేకాదు.. పాలనా రథాన్ని పరుగులు తీయించటం కోసం తాను జిల్లాల్లో పర్యటిస్తానన్న మాట అప్పుడప్పుడు కేసీఆర్ నోటి నుంచి రావటమే కాదు.. అది మాత్రం జరగదు. తాజాగా మరోసారి ఇదే మాట కేసీఆర్ నోటి వెంట వచ్చింది. త్వరలో తాను జిల్లాల్లో పర్యటిస్తానని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెలు.. పట్టణాల్లో పర్యటించి అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తానని ఆయన చెబుతున్నారు.

కాకుంటే కరోనాపూర్తిగా తగ్గిన తర్వాత జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. అంతేకాదు.. అందుకు డేట్ కూడా ఇచ్చేశారు. ఈ నెల 19 నుంచి తన పర్యటనలు మొదలవుతాయని చెప్పిన కేసీఆర్.. ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయంటూ వెల్లడించారు. పంచాయితీరాజ్.. మున్సిపల్ శాఖల అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించకూడదని చెప్పిన ఆయన.. ‘‘మీకు పూర్తి సమయం ఇవ్వాలనే ఇంతకాలం పర్యటన చేపట్టలేదు. రెండేళ్లు గడిచిపోయాయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. అలసత్వం.. నిర్లక్ష్యం వహించినట్లు నా పర్యటనలో గుర్తిస్తే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు ఉంటాయి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News