కొత్త కోణం.. కరోనాను ఇలా కూడా కనిపెట్టేయొచ్చట

Update: 2020-03-23 06:20 GMT
కరోనా ప్రపంచాన్ని ఆగమాగం చేస్తోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత భయాందోళనలకు గురి చేస్తోంది కోవిడ్ -19. జలుబు.. జ్వరం.. శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు.. గొంతు నొప్పి లాంటి గుణాలు ఉన్నంతనే కరోనా సోకిందనటానికి లక్షణాలుగా చెబుతున్నారు. ఇలాంటివేళ.. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వైద్యులు ఒక కొత్త విషయాన్ని తాము గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా నిరూపించనప్పటికీ.. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వారు.. పలువురికి చికిత్స చేస్తున్న సమయంలో వారు చెప్పే అంశాల ఆధారంగా కొత్త అంశాన్ని గుర్తించారు.

కరోనాకు సంబంధించి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేనప్పటికీ.. ఆరోగ్యంగా ఉన్నా వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు త్వరలోనే పెరుగుతాయన్న విషయానికి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి ప్రపంచం ముందుకు వచ్చింది. ప్రస్తుతం వైరస్ లక్షణాలు ఉన్నాయా? లేవా? అన్నది గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు. దాని ద్వారా పాజిటివ్ లేదంటే నెగిటివ్ అన్నది తేలుస్తున్నారు. ఇదంతా బాగున్నా..కొద్దిమందికి ఎలాంటి రోగ లక్షణాలు లేకున్నా.. విదేశాల నుంచి వచ్చిన వారం తర్వాత అనారోగ్యానికి గురి కావటం.. కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే.

మరి.. ఇలాంటి వారిని ఎలా గుర్తించాలి? అన్నదిప్పుడు సమస్య. మన వద్ద వరకూ చూస్తే.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్ సోకే అవకాశం ఉండటంతో వారికి థర్మల్ పరీక్షలు చేయటం.. అనుమానంగా ఉన్న వారికి పరీక్షలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కరోనా వైరస్ బారిన పడే వారికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని వివిధ దేశాలకు చెందిన వైద్యులు గుర్తిస్తున్నారు. అదేమంటే.. కరోనా పాజిటివ్ అని తేలటానికి కాస్త ముందుగా పలువురిలో వాసనను గుర్తించే గుణాన్ని కోల్పోవటం.. రుచిని గుర్తించే లక్షణం తమలో మిస్ అవుతున్నట్లుగా పలువురు వైద్యులు చెబుతున్న వైనాన్ని అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది.

కరోనా పాజిటివ్ అని తేలిన ఒక తల్లి తన చిన్నారి డైపర్ వాసనను గుర్తించలేకపోయిదని.. అదే విధంగా రోజువారీగా వండే వంటల వాసల్ని అస్సలు గుర్తించలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. మిఠాయిలు.. షాంపోలు.. చిన్నఉల్లి.. ఉల్లి లాంటి ఘాటువాసనల్ని కూడా తమ ముక్కుకు పట్టటం లేదంటున్నారు. క్వారంటైన్ లో ఉన్న పలువురు కరోనా పాజిటివ్ అని తేలక ముందు నుంచే.. తాము వాసనను గుర్తించే గుణాన్ని కోల్పోతున్నట్లు చెబుతున్నారు. తినే ఆహారపదార్థాల రుచిని గుర్తించే గుణాన్ని మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ విషయాల్ని ఒకరిద్దరు వైద్యులు కాదు.. వివిద దేశాల్లో కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్యులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. దక్షిణ కొరియాలో 2వేల మంది కరోనా పాజిటివ్ పేషంట్లకు పరీక్షలు జరిపినప్పుడు అందులో 30 శాతం మంది వాసన గుర్తించే గుణాన్ని తాము మిస్ అయినట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు లేకున్నా.. వాసనను గుర్తించలేకపోవటం.. తినే ఆహారం రుచిని తాము ఫీల్ కావట్లేదన్న వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటంతో పాటు.. వారు మరింత కేర్ ఫుల్ గా ఉండటం చాలామంచిదని చెప్పక తప్పదు. సో.. బీకేర్ ఫుల్.

Tags:    

Similar News