మేమూ చెత్త పొస్తాం.. సీన్ రివర్స్... ?

Update: 2022-04-01 12:31 GMT
చెత్త పన్ను. ఇది మెల్లగా అందరికీ పాకిపోయింది. ఇదేంటి ఈ పన్ను. పరమ  చెత్తగా ఉంది అని అనేస్తున్నారు. చెత్తకు పన్నేంటి మహా ప్రభో అని సెటైర్లు వేస్తున్నారు. చెత్తకు పన్ను కట్టాలా. అదేమైనా ఆస్తి పన్నా అని వెటకారం ఆడుతున్నారు. కొందరైతే మండిపోతున్నారు. మరికొందరు చెత్తకు పన్నేంటని గుడ్లురుమురున్నారు. మొత్తానికి ఏ పన్నుకీ రాని అతి పెద్ద నిరసన, అది కూడా ప్రజా నిరసన ప్రజల నుంచి చెత్త పన్నుకు వస్తోంది.

అయితే చెత్తకు పన్ను వసూల్ చేయాల్సిందే అని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో శానిటరీ స్టాఫ్ కి అటూ ఇటూ తల పోటు తప్పడంలేదు. పన్ను అడిగితే జనాలు కసురుతున్నారు. వసూల్ చేయకపోతే పనిష్మెంట్ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో ఎందుకొచ్చిన చెత్త పన్ను అని వారూ అనుకునే సీన్ ఉంది.

ఇక విశాఖలో చెత్త పన్ను అయితే అతి పెద్ద ఇష్యూగా మారుతోంది. చెత్తకు పన్ను కట్టమని వార్డులకు వార్డులు భీష్మించుకుని కూర్చున్నాయి. ఓటేసిన కార్పోరేటర్లు తమ వైపు వస్తే ఇదేం పన్ను, ఇందుకేనా ఎన్నుకున్నది అని ప్రజలే ఎక్కడికక్కడ నిలదీసే సీన్ ఉంది. ఇక విపక్ష టీఎడీపీ ఇతర పార్టీలు అయితే చెత్త పన్ను కట్టవద్దు, ఇలాగే ఉండంది, మేము మీకు అండ అంటూ జనాల వైపు నిలబడుతున్నారు.

ఈ నేపధ్యంలో పౌర సంఘాలు కూడా చైతన్యం అవుతున్నాయి. మహా విశాఖ సంస్థలలోని 98 వార్డుల్లో కూడా చెత్త పన్నుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, పౌర సంఘాలతో ఉద్యమమే మొదలైపోయింది. చెత్త పన్ను ఆపుతారా లేదా అని ఈ సంఘాల ప్రతినిధులు అల్టిమేటమే ఇచ్చేశారు.

మీరు ఆపకపోతే చెత్త పన్ను మీద మాదైన నిరసన ఏంటో చవి చూస్తారు అని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నెల 5న విశాఖ కార్పోరేషన్ ముందు చెత్తను పోసి తామే ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇస్తున్నారు. చెత్త పన్ను కట్టడం లేదని అధికారులు మా ఇళ్ళ ముందు చెత్త పోయడం కాదు, మేమే ఆఫీసుల ముందు చెత్త అంతా తెచ్చి పోస్తామని బిగ్ సౌండ్ చేస్తున్నారు.

ఇక దీని మీద సీపీఐ నాయకులు అయితే ఏకంగా జీవీఎంసీ ఎదుట తామే ప్రజా కౌన్సిల్ ని నిర్వహించి చెత్త పన్నుకు ఆ సభలో రద్దు చేసి పారేస్తామని చెబుతున్నారు. చెత్త పన్ను విషయంలో తగ్గకపోతే వైసీపీకి అదే ప్రజా వ్యతిరేకతగా మారుతుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి ఎందుకొచ్చిన చెత్త బాబోయ్ అని అటు జనాలే కాదు, ఇటు అధికారులే కాదు, మరో వైపు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఆఫ్ ది రికార్డుగా అనుకునే సీన్ ఉందిపుడు.
Tags:    

Similar News