అన్నా క్యాంటీన్లు... సున్నం పెట్టేస్తున్నాయి....?

Update: 2022-07-29 02:30 GMT
అన్నా క్యాంటీన్లు ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్యాంటీన్లను నెమ్మదిగా ఒక్కో నియోజకవర్గంలో కొన్ని గుర్తించిన ఏరియాల్లో పెడుతూ టీడీపీ తనదైన రాజకీయానికి పదును పెడుతోంది. పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమాన్ని అమలు చేశామని చెబుతున్న వైసీపీని ఈ విధంగా టీడీపీ  పెను సవాల్ చేస్తోంది. నిజానికి అన్నం పెట్టిన వారిని ఎవరూ మరచిపోరు. డబ్బు ఇస్తే ఇవాళ తీసుకుని రేపు మాట మార్చేస్తారు.

ఏపీలో ఇపుడు వైసీపీ సంక్షేమం మీదనే రాజకీయం పక్కాగా చేస్తోంది. వచ్చే ఎన్నికలలో తమను గెలిపించే సోపానాలుగా సంక్షేమ పధకాలను భావిస్తోంది. అయితే టీడీపీ కూడా తన ఏలుబడిలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఎన్నికలకు తొమ్మిది నెలలు ఉంటుందనగా 2018 జూలైలో ఏపీలో అన్నా క్యాంటీన్లను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఏపీలో చాలా చోట్ల వీటిని పెట్టారు. రైతు బజార్లు, బస్టాండ్లు, కీలకమైన చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి అయిదు రూపాయలకే టిఫిన్, రెండు పూటలా భోజనం పెడుతూ వచ్చారు. అలా  టీడీపీ సర్కార్ అన్నా  క్యాంటీన్లను ఒక సాహసంగా ప్రారంభించింది.  నిజానికి అన్నా క్యాంటీన్ల వల్ల మంచి పేరు కూడా  టీడీపీ  సర్కార్ కి వచ్చింది. దానిని మరి కొంతకాలం ముందు పెడితే ఆ ప్రభావం ఎలా ఉండేదో కానీ ఎన్నికల ముందు కాబట్టి అప్పటికే జనాలు ఒక అభిప్రాయానికి రావడంతో కలసిరాలేదు.

కానీ ఈ పధకం వల్ల లబ్ది పొందిన వారు ఎక్కువ. ఇక్కడ పేదా గొప్పా తారతమ్యం లేదు. ఎవరైనా అన్నా క్యాంటీన్ కి వెళ్ళి టిఫిన్ భోజనం చేసేవారు. ముఖ్యంగా నిరుద్యోగులు, పేదలు, మధ్యతరగతి వర్గాలు, చిరుద్యోగులు చాలా మంది లబ్ది పొందారు. రుచి శుచి ఉండడంతో తక్కువ టైమ్ లోనే పేరు తెచ్చుకున్నాయి.

అలాంటి అన్నా క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వస్తూనే రద్దు చేసింది. దాని మీద కొత్తల్లో టీడీపీ ఆందోళనలు చేసినా వైసీపీ సర్కార్ పెద్దలు పట్టించుకోలేదు. ఇపుడు సరైన టైమ్ అనుకుని టీడీపీ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. టీడీపీ నేతలు తమ సొంత ఖర్చుతో టెంట్లు వేసి మరీ ప్రతీ నియోజకవర్గంలో వీటిని ఓపెన్ చేస్తున్నారు. దీంతో మళ్లీ జనాలు ఇక్కడకు వచ్చి హాయిగా కడుపు నింపుకుంటున్నారు.

టీడీపీ వారు మంచి పని చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇలా వచ్చిన వారితో టీడీపీకి ప్రచారం కూడా అవుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని కూడా ఆ పార్టీ నేతలు జనాలకు  చెబుతున్నారు. ఇలా రాజకీయంగా  భారీ లబ్ది కలిగించే స్కీమ్ గా దీన్ని టీడీపీ ఎంచుకుంది. నేతలు కూడా వీటిని సొంత ఖర్చుతో పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

మరో వైపు వైసీపీ అయితే వీటిని గట్టిగా వ్యతిరేకించలేకపోతోంది. టెంట్లను తీసి అవతల పారేసేలా అధికరులు కొత్తల్లో చేసిన చర్యలకు జనాల నుంచే వ్యతిరేకత రావడంతో వారు తగ్గిపోతున్నారు. ఇపుడు ఏపీలో చాలా చోట్ల టీడీపీ నేతలు అన్న క్యాంటీన్లను టెంట్లలో పెడుతున్నారు. మొత్తానికి ఎన్నో పధకాలు అమలు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఇంత అన్నం పేదలకు ఎందుకు పెట్టలేకపోతోంది అని టీడీపీ వేస్తున్న ప్రశ్నలకు జవాబు లేదు. అన్న క్యాంటీన్లే కదా అని ఊరుకున్నారు. కానీ ఇవే ఇపుడు సున్నం పెట్టేలా మారాయని అధికార పార్టీ కలత చెందుతోంది. మరి దీనికి ఆదరణ ఇంకా పెరిగితే వైఎస్సార్ అన్న క్యాంటీన్లు పోటీగా అధికార పార్టీ తరఫున కూడా వెలుస్తాయోఅమో చూడాలి మరి.
Tags:    

Similar News