జగన్ లో బిజినెస్ మ్యాన్ మిస్ అయ్యాడేంటి?

Update: 2023-01-13 02:30 GMT
ఒక రాష్ట్రానికి పాలకుడు అన్నంతనే వారి ముందున్న లక్ష్యాలు ఏముంటాయి? ప్రజలకు అవసరమైన పాలనను చేయటం.. వారి అవసరాల్ని తీరుస్తూ.. వారి కోరికల్ని నెరవేరుస్తూ.. వారి కలల్ని తీర్చే ప్రయత్నం చేస్తూ.. ఖజానాలో కాసుల గలగల విషయంలో తేడా రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమం కార్యక్రమాలు.. ప్రజాకర్షక పథకాల మత్తులో పడిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తుండటంతో ఆదాయం ఎంత వచ్చినా కూడా సరిపోని పరిస్థితి.

ఇలాంటి వేళలో.. పరిస్థితిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్తంత తెలివిగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. తనకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్ని పెద్ద ఎత్తున శోధిస్తూ ఉంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు విధించే చలానాలు పెద్ద ఎత్తున పేరుకుపోవటమే తప్పించి.. ఖజానాకు సొమ్ములు చేరని వైనాన్ని గుర్తించిన వారు.. 50 -75 శాతం వరకు రాయితీ కల్పిస్తూ మేళాను నిర్వహించటంతో వందల కోట్లు ఖాజానాకు వచ్చి చేరాయి.

నిజానికి ఈ తరహా ఆలోచన ఎవరూ ఊహించనిది. కానీ.. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ సర్కారు వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆయనలో ఉన్న మరో లక్షణం.. తమ్ముడు తమ్ముడే. పేకాట పేకాటే. రాజకీయంగా తనకు తేడా చేసే వారి సంగతిని ఒక పక్క చూసుకుంటూనే.. అవసరానికి వారిని తనకు అనుకూలంగా మార్చుకోవటం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళలో తమ చేతికి అధికారం వచ్చినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ తమను పట్టించుకోని వైనాన్ని.. తనను గుర్తించని విషయాన్ని గుర్తించినప్పటికీ ఆ విషయాన్ని బాహాటంగా ఎప్పుడూ చెప్పింది లేదు. వారిని దారికి తెచ్చుకోవటానికి బాహాటంగా కొరడా ఝుళింపించింది లేదు.

సరైన టైం కోసం చూసి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేయటంతో కేసీఆర్ ను గుర్తించకున్నా.. ఆయనకు కోపం తెప్పించినా.. తమకు జరిగే నష్టం గురించి అర్థమయ్యేలా చిత్రపరిశ్రమలో ముఖ్యులకు గుట్టుగా తెలిసేలా చేసిన టాలెంట్ కేసీఆర్ సొంతం. అదే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే.. ఆయన వ్యవహారం కాస్త నాటుగా ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఏం చేసినా సరే.. నాటుగా చేసే విషయంలో జగన్ సర్కారు తర్వాతే ఎవరైనా అంటారు.

తమను వ్యతిరేకించే వారి లెక్క తేల్చేందుకు ఎంత మోటుగా అయినా సరే ముందుకెళ్లే ధోరణి జగన్ సర్కారులో కనిపిస్తూ ఉంటుందని చెబుతారు. ఎప్పుడైతే కేసీఆర్ దగ్గరైనా తెలుగుచిత్ర పరిశ్రమను తనను గుర్తించని విషయాన్ని పర్సనల్ గా తీసుకున్న జగన్.. తనకు అలవాటైన నాటు ధోరణితో వ్యవహరించి.. సినిమా టికెట్ల ధరల్ని దారుణంగా తగ్గించేసిన ఎపిసోడ్.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పంచాయితీ గురించి తెలిసిందే. ఒకపక్క తాను అమలు చేస్తున్న పథకాలకు అవసరమైన నిధుల్ని అప్పుల రూపంలో తెచ్చే అలవాటును అంతకంతకూ పెంచుకోవటమే తప్పించి.. సుతిమొత్తగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని పెంచుకోవటానికి ఉన్న మార్గాల్నివదిలేసినట్లుగా చెబుతారు.

ఇప్పుడు చెప్పే ఉదాహరణ చిన్నదిగా అనిపించొచ్చు. కానీ.. ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద వాటి వరకు పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శిస్తే.. ఏపీకి ఇప్పుడున్నంత గడ్డు పరిస్థితి ఉండదనే చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా సినిమాలు పెద్ద ఎత్తున విడుదలవుతుంటాయి. తెలుగు ప్రజలు.. అందునా ఏపీకి చెందిన వారి జీవితాల్లో వినోదం అన్నంతనే సినిమా వైపు చూడటం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి చోట తెలంగాణలో ఎలా అయితే రోజుకు ఐదు షోలు.. పెద్ద చిత్రాలు విడుదలైన రోజున ఆరు ఆటలు వేసుకోవటానికి వీలుగా అనుమతి ఇవ్వటం ద్వారా.. తాను చిత్ర పరిశ్రమకు వ్యతిరేకం కాదన్న సందేశాన్ని పంపటంతో పాటు.. ఆదాయానికి ఆదాయం ఖజానాకు వచ్చేలా చేసుకోవచ్చు.

రాజకీయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవటంతో వచ్చే సమస్య జగన్ లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి కేసీఆర్ తో పోలిస్తే.. జగన్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయన సీఎం కాక ముందు పలు సంస్థల్ని నడిపించిన అనుభవం ఉంది. ఆయన నిర్వహించే సంస్థల్లో ఏ ఒక్కటి కూడా నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నది లేదు. అన్నీ సంస్థలు లాభాలతో కళకళలాడుతున్నవే. మరి.. తన కుటుంబ సంస్థలు ఏవీ నష్టాల్లో నడవనప్పుడు.. ఏపీ ప్రభుత్వం మాత్రం నిత్యం నిధుల కొరతతో ఎందుకు సతమతం అవుతుందన్నది ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు బిజినెస్ మ్యాన్ కాని కేసీఆర్ కంటే కూడా రాజకీయం కంటే మొదట బెజినెస్ ను కెరీర్ గా మలుచుకున్న జగన్ లోని బిజినెస్ మ్యాన్ మిస్ కావటమే ఏపీకి శాపంగా మారిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News