జనాల నడ్డి విరిచేలా బాదేస్తుంటే ఆదాయం అంత భారీగా పెరగదా?

Update: 2022-08-01 23:30 GMT
ఒక దేశం.. ఒక పన్ను విధానం పేరుతో మోడీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం భారీగా తగ్గుతుందన్న మాట వినిపించినా.. అందుకు భిన్నంగా పెరుగుతున్న ఆదాయం చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.

యూపీఏ హయాంలో రూపుదిద్దుకున్న జీఎస్టీని తనదైన రీతిలో కొన్ని మార్పులు చేసి తీసుకొచ్చిన ఈ కొత్త పన్నుల విధానంలో చేసిన మార్పులు.. కేంద్రానికి భారీగా ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మోడీ మాష్టారు పవర్లోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఈ పన్నుల పరిధిలోకి కొత్తగా తీసుకొచ్చిన వస్తుసేవల కారణంగా.. జనాల జేబులకు చిల్లులు పడుతుంటే.. కేంద్ర రాష్ట్రాల ఖజానా మాత్రం కళకళలాడుతోంది.

తాజాగా ముగిసిన జులై మాసానికి సంబంధించిన జీఎస్టీ ఆదాయాన్ని చూస్తే.. పన్ను ఆదాయం భారీగా వచ్చిన వైనం కనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 28 శాతం వృద్ధి రేటుతో ఈసారి రికార్డు ఆదాయాన్ని మూటగట్టుకుందని చెప్పాలి. అయితే.. ఇంత భారీ ఆదాయానికి కారణాల గురించి వెల్లడిస్తూ.. ‘ఆర్ధిక రికవరీ.. పన్ను ఎగవేతలు అరికట్టటం లాంటి కారణాలతో వసూళ్లు పెరిగాయి’ అని కేంద్రం పేర్కొంది. ఈ జులైలో రూ.1.49 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగినట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది జులైలో జీఎస్టీ వసూళ్లు రూ.1.16 లక్షల కోట్లు మాత్రమే కావటం గమనార్హం.

జీఎస్టీని అమల్లోకి తెచ్చిన 2017 తర్వాత జులైలో వచ్చిన వసూళ్లే రెండో అత్యధిక వసూళ్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో తొలిసారి రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా.. గత నెలలో వచ్చిన వసూళ్లు రెండో అత్యధిక వసూళ్లుగా చెప్పాలి. దేశ వ్యాప్తంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లకు తగ్గట్లే.. తెలుగు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లుగా చెబుతున్నారు.

గత జులైలో తెలంగాణలో రూ.3610 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు రాగా.. ఈసారి 26 శాతం వృద్ధితో రూ.4547 కోట్ల ఆదాయం వచ్చింది. అదే సమయంలో ఏపీలోనూ జీఎస్టీ వసూళ్లు భారీగానే వసూళ్లు అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధితో రూ.3409 కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ ఆదాయం పెరగటానికి కేంద్రం చెబుతున్న కారణాలకు భిన్నంగా వాస్తవం ఉందంటున్నారు.

తరచూ జీఎస్టీ పరిధిలోకి వస్తున్న వస్తు సేవల కారణంగానే రాబడి భారీగా పెరుగుతుందంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పన్ను వసూళ్లలో 25 శాతానికి పైనే వృద్ధి కనిపిస్తుంటే.. దేశంలోని అత్యధికుల వార్షిక ఆదాయంలో వృద్ధి ఇందులో సగం కూడా లేదన్న మాట వినిపిస్తోంది. పన్ను వసూళ్ల పరిధి పెరిగిపోతున్నకొద్దీ.. ఆదాయం పెరిగినా.. చేతిలో మిగిలే మొత్తాలు మాత్రం పరిమితంగానే ఉంటున్నాయి.
Tags:    

Similar News