రాజుగారూ...మారిందండీ రాజకీయం...

Update: 2022-11-03 02:30 GMT
ఆయన ఆ నియోజకవర్గానికి మకుటం లేని మహరాజుగా రెండు దశాబ్దాల కాలంగా వెలుగొందుతున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసలు పేరు రమణమూర్తి రాజు. కొసరు పేరు కన్నబాబురాజు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఆయన కోట. రెండు దశాబ్దాల రాజీకీయ జీవితమలో ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలవడం అంటే మాటలు కాదు. పైగా అక్కడ బలమైన  కాపు సామాజికవర్గానికి ధీటుగా రాజకీయాలు చేయడంలో రాజు గారి ఆరితేరిపోయారు.

ఆయన వరకూ ఓకే కానీ 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడు సుకుమార వర్మను ఎమ్మెల్యేగా బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. దాంతో వైసీపీలో ముసలం పుట్టింది. నిజానికి రాజు గారు 2014లో టీడీపీలో ఉన్నారు. 2019 నాటికి వైసీపీలో చేరారు. దాంతో అప్పటిదాకా పార్టీలో ఉన్న వారు అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తన వెంట ఉన్న క్యాడర్ తో పాటు మిగిలిన నాయకత్వాన్ని కలుపుకుని జగన్ వేవ్ లో రాజు గారు 2019 ఎన్నికల్లో గెలిచారు. 2024 నాటికి ఆయనకు టికెట్ డౌట్ అని కూడా అంటున్నారు.

ఎందుకంటే ఇక్కడ జనసేన బలంగా ఉంది. టీడీపీతో పొత్తు కుదిరితే ఇబ్బందే అని కూడా విశ్లేషణ ఉంది. దాంతో ఈ సీటుని కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు. ఇక 2019లో అధినాయకత్వం చెప్పిన మేరకు రాజు గారికి సపోర్ట్ చేసిన వైసీపీ జనాలు ఇపుడు ఆయన వారసుడిని దించుతాను. తమ కుటుంబానికే పర్మనెంట్ గా సీటుని కట్టేసుకుంటామంటే ఊరుకోవడంలేదు. అందుకే బలమైన వ్యతిరేక వర్గం చాన్నాళ్ళుగా అక్కడ రాజు గారికి తయారైంది.

ఇపుడు ఆ వర్గం ఏకంగా రోడ్డున పడింది. తాజాగా రాజు గారు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొంటే ఏకంగా ఆయననే అడ్డగించేసారు. అలా అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు ఈ విధంగా మరోసారి నిరసన ఎదురైంది. ఎమ్మెల్యే కన్నబాబుకు వ్యతిరేకంగా  దొప్పర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడం ఇక్కడ విశేషం.

ఈ సందరంభంగా వైసీపీ శ్రేణులు అంటున్న మాట ఏంటి అంటే ప్రభుత్వ పథకాల అమలులో ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని, ఆయన తన ప్రాంతానికి అసలు రావద్దు అంటూ వారు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కన్నబాబు అరాచకాలు నేరుగా  సీఎం జగన్‌కు చేరాలని, కన్నబాబు అరాచకాలు అంతం కావాలని ప్లకార్డులను సైతం వారు  ప్రదర్శించారు. అంతే కాదు ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

అయితే సరైన సమయంలో  పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే కన్నబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.  దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం వైసీపీలోనే చర్చకు తావిస్తోంది.

అయితే ఇది తనకు వ్యతిరేకంగా పార్టీలో ఒక  వర్గం చేస్తున్న పని అని కన్నబాబు రాజు వర్గం చెబుతోంది. అయితే కన్నబాబు రాజు రిటైర్మెంట్‌కు సిద్ధమై ఇప్పుడు తన కొడుకు సుకుమార్ వర్మను వచ్చే ఎన్నికల్లో వారసుడిగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దాని వల్లనే ఆయనను వ్యతిరేకిస్తున్నట్లుగా రెండవ వర్గం అంటోంది. మొత్తానికి ఎలమంచిలిలో మరోమారు కన్నబాబు ఫ్యామిలీకి టికెట్ ఇస్తే కనుక కచ్చితంగా వైసీపీ ఓడిపోతుందని కూడా వారు చెబుతున్నారు. చూడాలి మరి ఈ పంచాయతీ జగన్ ఎలా సెట్ చేస్తారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News