గడపగడపకూ తండ్రీ కొడుకులు...రాజు గారి రాజకీయం

Update: 2022-12-11 03:30 GMT
రాజు గారు బహు గడుసు వారు. ఏ గాలి ఎటు వైపు వీస్తే అటు వైపు షిఫ్ట్ అయిపోవడానికి ఏమాత్రం జంకేది లేదు. కాంగ్రెస్ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పేరు కన్నబాబు రాజు. 2004 నుంచి ఎలమంచిలిని అట్టిపెట్టుకుని పాలిటిక్స్ చేస్తున్న కన్నబాబు రాజు 2014 నాటికి టీడీపీ వైపు జరిగారు. అయితే ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ కూడా బాబు ఇవ్వలేదు.

దాంతో అంతా సర్దుకుని ఆయన 2019 నాటికి వైసీపీలోకి వచ్చి మూడవసారి ఎమ్మెల్యే అయిపోయారు. ఇక ఆయన ఇపుడు 2024 ఎన్నికల మీద దృష్టి పెట్టారు. వైసీపీ అధినాయకత్వం గడగ గడపకూ ప్రోగ్రాం ఇచ్చింది. దాని ద్వారా ఎమ్మెల్యే ప్రతీ ఇంటికీ వెళ్ళి పార్టీ గురించి చెబుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించమని నిర్దేశించింది.

అయితే దాన్ని రాజు గారు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ అయిన సుకుమారవర్మను కూడా వెంటబెట్టుకుని ప్రతీ గడపకూ కలియతిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడే ఎమ్మెల్యే అభ్యర్ధి అంటూ ఆయన ఇండైరెక్ట్ గా ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు. తన రాజకీయ వారసుడిగా వర్మను జనంలో పరిచయం చేస్తూ పార్టీ జనాలలో కూడా మరో పోటీ లేకుండా చూసుకుంటూ వస్తున్న రాజు గారి తెలివే తెలివి అంటున్నారు అంతా.

ఆ మధ్యన తాడేపల్లికి వెళ్ళి ఏకంగా జగన్ కే తన కుమారుడిని పరిచయం చేసి టికెట్ ఇవ్వాలని చూచాయగా చెప్పి ఉంచారు. అయితే ఎలమంచిలిలో రాజు గారి గ్రాఫ్ బాగా పడిపోయినట్లుగా వైసీపీ హై కమాండ్ కి సర్వే నివేదికలు చేరాయి. అదే విధంగా చూస్తే రాజు గారి దూకుడు మూలంగా పార్టీలో కూడా వర్గాలు పెరిగాయి. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిసామని ప్రత్యర్ధి వర్గం అంటోంది.

ఈ మధ్యనే ఆయన గడప గడప టూర్ లో సొంత పార్టీకి చెందిన వారే ఆందోళన చేసి ఆయన రాకను అడ్డుకున్నారు. ఇక ఎలమంచిలి నియోజకవరం చూస్తే కాపులు ఎక్కువ. బలమైన సామాజికవర్గం నుంచి ఈ మధ్యనే ఎమెల్యేలు గెలుస్తున్నారు. 2014లో టీడీపీ పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ఇస్తే ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన సుందరపు విజయ కుమార్ మంచి సంఖ్యలో ఓట్లను సాధించారు. ఆయన కూడా బలమైన సామాజికవర్గానికి చెందీన్ వారే.

ఇక్కడ జనసేన పట్టు గట్టిగా ఉంది. దాంతో వైసీపీ హై కమాండ్ కూడా సామాజిక సమీకరణలు ఒకటికి పదిసార్లు చెక్ చెసుకుంటూ ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సైతం కాపులకే టికెట్ ఇస్తుంది అని అంటున్నారు. దాంతో వైసీపీ కూడా ఆ సామాజికవర్గం వైపే మొగ్గు చూపుతోంది అని అంతున్నారు. పైగా కన్నబాబు రాజు పట్ల వ్యతిరేకత ఉండడం తో టికెట్ నిరాకరిస్తారు అని అంటున్నారు. ఆయన ఇంట్లో నుంచి కుమారుడికి టికెట్ ఇచ్చినా సేమ్ రిజల్ట్ వస్తుందని వైసీపీ ఆలోచిస్తోంది.

అయితే అర్ధబలం గట్టిగా ఉన్న రాజు గారు చాణక్య రాజకీయంతో తన కుమారుడికే టికెట్ తెచ్చుకుంటాను అని గట్టిగా చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆర్ధికం కూడా క్రియాశీల పాత్ర పోషిస్తుంది కాబట్టి కన్నబాబు రాజు ధీమాను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. మరి రాజు గారి రాజకీయం పారుతుందా. వైసీపీలో ఆశావహుల కోరిక తీరుతుందా ఎలమంచిలిలో వైసీపీకి మంచి అభ్యర్ధిగా ఎవరు వస్తారు అన్నది వేచి చూడాల్సిందే.

మొత్తానికి రాజు గారు మాత్రం తన కుమారుడే ఎమ్మెల్యే అని జనాలకు చెప్పేసుకుంటున్నారు. ప్లాన్ బీ ప్లాన్ ఏదైనా ఆయన మదిలో ఉందేమో అని కూడా అంటున్నారు. అంటే వైసీపీ కాకపోతే వేరే పార్టీ అన్న మాట. మొత్తానికి ఎలమంచిలిలో తండ్రీ కొడుకులూ ప్రతీ గడపనూ ఎక్కి తొక్కేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News