సారీలు చెప్పాల‌ని కూడా అడుక్కుంటారా?

Update: 2015-12-28 09:34 GMT
ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కు కాస్త నోరు ఎక్కువే. ఆయ‌న అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌క‌పోతే చాలు అస‌హ‌నం చెందుతారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల త‌న‌పై చేసే మాట‌ల దాడిలో పైచేయి ప్ర‌ద‌ర్శించుకునేందుకు వెనుకాముందు చూసుకోకుండా మాట్లాడేస్తుంటారు. ఇందులో భాగంగా కింద ప‌డ్డా పైచేయి త‌నదే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో చోటుచేసుకున్న అవినీతికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పై అవినీతి మ‌ర‌క వేసిన ఎపిసోడ్ తెలిసిందే.

ఈ వ్య‌వ‌హారంలో జైట్లీ పాత్ర‌పై కేజ్రీవాల్ అండ్ కో చేసిన వ్యాఖ్య‌ల జోరు చూసిన వారికి.. కేంద్ర‌మంత్రి అడ్డంగా దొరికిపోయారా? అన్న సందేహం క‌లిగేంత స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై వేసిన విచార‌ణ క‌మిటీ తాజాగా ఇచ్చిన నివేదిక చూస్తే కాస్తంత షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. ఈ వ్య‌వ‌హారంలో జైట్లీ పేరును ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన దానికి భిన్నంగా.. నివేదిక‌లో ఆయ‌న పేరు మాట వ‌ర‌స‌కు కూడా లేక‌పోవ‌టంతో.. ఆమ్ ఆద్మీ నేత‌ల‌కు కాస్త షాకింగ్ క‌లిగించే అంశ‌మే.

క‌మిటీ నివేదిక‌లో అరుణ్ జైట్లీ పేరును లేక‌పోవ‌టంతో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. చేసిన త‌ప్పున‌కు లెంప‌లేసుకొని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ కే్జ్రీవాల్‌ పై క‌మ‌ల‌నాథులు విరుచుకుప‌డుతున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. జైట్లీ ఇష్యూలో కేజ్రీవాల్ డిఫెన్స్ లో ప‌డిన ప‌రిస్థితి. అలా అని త‌న ప‌రిస్థితిని ఒప్పుకునేంత ప‌రిస్థితే ఉంటే ఆయ‌న కేజ్రీవాల్ ఎందుకు అవుతారు? అందుకే ఆయ‌న త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.  జైట్లీ విష‌యంలో త‌న‌ను సారీ చెప్పాలంటూ బీజేపీ నేత‌లు దాదాపుగా అడుక్కుంటున్నారంటూ మండిప‌డ్డారు. క‌మ‌ల‌నాథులు ఎంత‌గా అడుక్కున్నా తాను మాత్రం క్ష‌మాప‌ణ‌లు చెప్పేది లేద‌ని తేల్చారు.

జైట్లీ పేరును క‌మిటీ ప్ర‌స్తావించ‌కున్నా.. ఈ వ్య‌వ‌హారంలో అవినీతి జ‌రిగింద‌ని.. దీని బాధ్యుల్ని క‌నుగొనేందుకు క‌మిష‌న్ వేయాల‌ని చెప్ప‌టం చూస్తే.. అవినీతిలో జైట్లీ హ‌స్తం లేద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రంటూ విచిత్ర‌మైన వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. ఏ విష‌యంలో అయినా అవినీతి జ‌రిగితే.. దానికి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారు కానీ.. త‌మ‌కు న‌చ్చ‌ని వ్య‌క్తుల‌కు దానికి లింకు క‌ట్టేయ‌టం ఉండ‌దు. కానీ.. కేజ్రీ మాత్రం.. అందుకు భిన్నంగా అవినీతి జ‌రిగిందని తేల్చిన క్ర‌మంలో జైట్లీకి క్లీన్ చిట్ ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఇలాంటి చిత్ర‌మైన వాద‌న‌లు కేజ్రీ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రేమో?
Tags:    

Similar News