ఏపీ అధికారులకు నో ఎంట్రీ.. సాగర్ వద్ద ఉద్రిక్తత

Update: 2021-07-01 09:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన‌ జ‌ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మాట‌ల‌తో మొద‌లైన పంచాయితీ.. నోటీసులు దాటి ముందుకెళ్తోంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విష‌యంలో నెల‌కొన్న పంచాయితీ.. ఇప్పుడు ప‌వ‌ర్ వార్ గా ట‌ర్న్ తీసుకుంది.

అనుమ‌తి లేకుండానే తెలంగాణ స‌ర్కారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంద‌ని, ఈ విష‌యాన్ని కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లాల‌ని మంత్రుల‌ను జ‌గ‌న్ బుధ‌వారం ఆదేశించారు. దీనిపై తెలంగాణ స్పందించింది. విద్యుత్ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్ప‌త్తి చేసి తీరుతామ‌ని, అడ్డుకోవ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని అన్నారు.

అయితే.. అంత‌టితో ఆగ‌కుండా.. నాగార్జున సాగ‌ర్‌, దాని కింద ఉన్న పులిచింత ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టడంతో వివాదం మ‌రింత ముదిరింది. విద్యుత్ ఉత్ప‌త్తికి విఘాతం క‌ల‌గ‌కుండా పోలీసుల‌ను సైతం భారీగా మోహ‌రించింది తెలంగాణ స‌ర్కారు. సాగ‌ర్ వ‌ద్ద దాదాపు 120 మంది పోలీసులు ప‌హారా కాస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే.. సాగ‌ర్ లో విద్యుత్ ఉత్ప‌త్తిని ఆపాల‌ని విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు ఏపీకి చెందిన అధికారులు, పోలీసులు సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు. వీరిలో మాచ‌ర్ల డీఎస్పీ, ఆర్డీవోతోపాటు ఎన్నెస్పీ ఎస్ ఈ కూడా ఉన్నారు. అయితే.. వారిని స‌రిహ‌ద్దు వ‌ద్ద‌నే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగ‌ర్ లోకి రావ‌డానికి వారిని అనుమ‌తించ‌లేదు. అంతేకాదు.. ఏపీ అధికారుల విన‌తి ప‌త్రాన్ని తీసుకునేందుకు సైతం తెలంగాణ అధికారులు నిరాక‌రించారు. దీంతో.. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.
Tags:    

Similar News