తాగేందుకు అసెంబ్లీలో స్టీల్ గ్లాస్ కూడా ఉండదే

Update: 2016-03-30 07:13 GMT
అసెంబ్లీ భవనం అంటే అద్భుతమైన సౌకర్యాలు ఉండాల్సిన అవసరం లేకున్నా.. కనీస అవసరాలకు తగిన సౌకర్యాలు అయినా ఉండాలిగా. కానీ.. అలాంటివేమీ అసెంబ్లీ ఆవరణలో కనిపించవు. లక్షలాది రూపాయిలు జీతాలు తీసుకునే విషయంలో ప్రజాప్రతినిధుల కష్టాల్ని ఏకరువు పెట్టే ముఖ్యమంత్రి మొదలు.. ఎమ్మెల్యేల వరకూ కనీస వసతులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన పెద్దగా ఉన్నట్లు కనిపించదు.

పేదోడికి సైతం డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇచ్చే ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రానికి చెందిన అసెంబ్లీలో మంచినీళ్లు తాగేందుకు స్టీల్ గ్లాస్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. స్టీల్ గ్లాస్ లేకపోవటం.. మంచినీళ్ల బాటిల్ ను సగానికి కోసి.. దాన్నే గ్లాస్ గా వాడే దైన్యం కనిపిస్తుంది. స్టీల్ గ్లాస్ మహా అయితే పాతిక రూపాయిలు ఉంటుంది. లేదంటే.. యాభై రూపాయిలకు ఎట్టి పరిస్థితుల్లో మించదు. కానీ.. అలాంటి కనీస సౌకర్యాల మీద ఎందుకు దృష్టి పెట్టరు. గ్లాస్ లేకపోతే ఇంత రచ్చ చేస్తారా? అని విసుక్కోవచ్చు. కానీ.. అలాంటి కనీస సౌకర్యాల విషయంలో ఎలాంటి లోటు ఉండకూదన్న విషయాన్ని పాలకులు కానీ.. అధికారులు కానీ ఎందుకు దృష్టి పెట్టరు..?

కౌన్సిల్ నుంచి అసెంబ్లీకి వచ్చే మార్గంలో ఉన్న వాటర్ డిస్పెన్సరీ దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి అసెంబ్లీలో ఉన్న బాత్రూంలలో శుభ్రత కూడా గొప్పగా ఏమీ ఉండదు. లక్షల కోట్ల రూపాయిల బడ్జెట్ తో రాష్ట్రాన్ని మొత్తంగా మార్చేస్తామని చెప్పే సర్కారు.. రాష్ట్రం మొత్తం కాకున్నా.. వారు కొలువు తీరి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు అవసరమైన ఆలోచనలు చెప్పే అసెంబ్లీ భవనం మొత్తంలో ఎలాంటి లోటు లేకుండా చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News