సోషల్ మీడియా పవర్ మరోసారి తెలిసివచ్చింది. ఫేస్ బుక్ - ట్విట్టర్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఉద్యమాలకు అనేక స్పందనలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వాలు తలవంచడం అనేది రేర్ గా జరిగే ఘటన. ఇలాంటి ఘటనే ఇప్పుడు మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరిగింది. అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియా - సిటిషన్ జర్నలిస్టుల ధాటికి దిగివచ్చింది. ప్రజల కన్నా మాకు ఏదీ ముందు కాదని ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. విషయంలోకి వెళ్తే.. కర్ణాటక అసెంబ్లీ(విధాన సభ) 60 ఏళ్ల సంబరాల సందర్భంగా ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధులకు ఆబగా దోచిపెట్టేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది.
దాదాపు ఒక్కొక్కటీ రూ. 50 వేలు విలువ చేసే బంగారు బిస్కెట్లను ఎమ్మెల్యేలకు పంచిపెట్టాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి అవసరమైన నిధులపై సంతకాలే తరువాయి.. అన్నట్టుగా తెరవెనుక పనికానిచ్చేశారు నేతలు. అయితే, ఇంతలోనే ఈ వార్త ఆనోటా ఈనోటా మీడియాకు తెలిసింది. అంతే.. ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేశారు. రాష్ట్రంలో జోరు వర్షాలు కురిసి, భారీ ఎత్తున వరద ఉప్పొంగి జనాలు నానా తిప్పలు పడుతుంటే వారిని ఆదుకునేందుకు డబ్బులు లేవంటున్న సర్కారు.. బంగారు బిస్కట్లు పంచుకునేందుకు డబ్బుందా? అంటూ జనాలు నేరుగా సీఎం సిద్దరామయ్యను నిలదీశారు.
ఇక, మీడియా కూడా కర్ణాటక నుంచి కాశ్మీర్ వరకు ప్రభుత్వాన్ని ఏకి పారేసింది. దీంతో సర్కారు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. మరోపక్క వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను శాంత పరచకపోతే మొత్తానికే పుట్టి మునుగుతుందని భావించిన సీఎం సిద్దరామయ్య వెనక్కి తగ్గారు. విధాన సభ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు బంగారు బిస్కెట్లు - ఉద్యోగులకు వెండి ప్లేట్లు ఇవ్వాలని, ఇతర కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు కలిపి రూ. 26 కోట్లు ఖర్చుచేయాలన్న ప్రతిపాదనలను నిలిపి వేశారు. ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల వేడుకలను ఒక్కరోజుకే కుదించి రూ.10కోట్లతోనే ఖర్చులను సరిపెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పుడు అదే ప్రజలు సిద్దరామయ్యకు జై కొడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా పవర్ ఏంటో తెలిసొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.