మోదీతో భేటీ...చైనా షాకింగ్ నిర్ణ‌యం!

Update: 2017-07-06 12:14 GMT
భార‌త్ - చైనాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. భార‌త్  - చైనా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డ నేపథ్యంలో చైనా వ్యాఖ్య‌లు అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ జీ 20 స‌ద‌స్సులో ప్రధాని నరేంద్రమోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ సమావేశమయ్యే పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది. జీ 20 సదస్సులో జిన్‌ పింగ్‌ ప్రధానితో మోదీతో అవనున్న భేటీని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న మోదీ నేడు హాంబర్గ్‌ వెళ్లనున్నారు. జీ 20 సదస్సులో ఆయా దేశాల నేతలను మోదీ కలుసుకుంటారు. ఈ భేటీల జాబితాలో చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌ పింగ్‌ కూడా ఉన్నారు. అయితే, మోదీ - జిన్ పింగ్ ల భేటీ ఉంటుందా లేదా అనే విషయంలో భార‌త్ నుంచి  అధికారిక ప్రకటన రాలేదు. ఈ లోగానే భేటీని రద్దు చేసుకున్నట్లు చైనా తెలిపింది.

మ‌రోవైపు, చైనాపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మండిప‌డ్డారు. ఉత్తర కొరియా అణుముప్పును కట్టడి చేయడంలో చైనా ఏమాత్రం సహకరించడం లేదని ట్రంప్ అన్నారు. ఇందుకు ప్రతీకారంగా చైనాపై వాణిజ్యపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. హాంబర్గ్‌ లో జరగనున్న జీ-20 సదస్సులో భాగంగా  చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ భేటీకి ముందే ఆయన చైనాపై విరుచుకుపడటం గమనార్హం.  
Tags:    

Similar News