గొంతు చించుకున్నా... ఫ‌లితం లేదు బాసూ!

Update: 2019-01-09 01:30 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న ప్రసంగాల‌తో ఎదుటి వారు ఎంత‌టి వారైనా ఇట్టే ఆక‌ట్టుకునే ర‌క‌మ‌ని ఆయ‌న పార్టీ నేత‌లు, తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. గ‌తంలో అయితే ఈ మాట నిజ‌మేనేమో గానీ... ఇప్పుడు ఈ మాట ఒట్టి బ్యాండ్ బాజానేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో చంద్ర‌బాబు... రాష్ట్ర పర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎన్నిక‌ల ప్ర‌చార‌మ‌న్న పేరు రాకుండా...త‌న ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న జ‌న్మ‌భూమి, ధ‌ర్మ పోరాట దీక్ష‌లు, జ్ఞాన భేరీలు.. ఇలా లెక్క‌లేన‌న్న కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసుకుంటున్న చంద్ర‌బాబు... ఆ అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ త‌న సెల్ఫ్ డ‌బ్బాను కొట్టుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. వేదిక ఏదైనా, కార్య‌క్ర‌మం ఏదైనా, సంద‌ర్భం ఏదైనా... బాబు నోట నుంచి ఒకే ర‌క‌మైన డైలాగులు వినిపిస్తున్నాయి. అవేంట‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏపీకి అన్యాయం చేస్తున్నారు, ఈ అన్యాయానికి రాష్ట్రం నుంచి జ‌గ‌న్‌, పొరుగు రాష్ట్రం నుంచి కేసీఆర్ తోడ్పాటునందిస్తున్నారు అన్న రొడ్డ కొట్టుడు డైలాగుల‌తోనే ఆయ‌న నెట్టుకొచ్చేస్తున్నారు. పైన చెప్పుకున్న వాటిలో ఏదో ఒక కార్య‌క్ర‌మం లేక‌పోయినా... ప్ర‌త్యేకించి మీడియా స‌మావేశాలు పెట్టుకుని మ‌రీ ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం ఒక్క చంద్ర‌బాబుకే చెల్లింద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా సాగుతున్నాయి.

తాజాగా నేటి ఉద‌యం క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు... జిల్లాలో క‌ర్నూలు స‌మీపంలో కొత్త‌గా ఏర్పాటైన ఓర్వ‌క‌ల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఆ త‌ర్వాత మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కోసిగి మండ‌లంలో జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మానికి వెళ్లిన చంద్ర‌బాబు... అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ చేసిన ప్ర‌సంగం ఇప్పుడు నిజంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే... ప్ర‌సంగం మొద‌లుపెట్ట‌డంతోనే కోసిగి ప్ర‌జ‌లంతా ఉత్సాహంగానే ఉన్నారా? అంటూ మొద‌లుపెట్టిన చంద్ర‌బాబు... కోసిగికి తాను చాలా సార్లు వ‌చ్చాన‌ని, గ‌తంలో ఎన్న‌డూ చూడ‌నంత ఉత్సాహం ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంత‌టితో ఆగ‌ని చంద్ర‌బాబు... ఇప్పుడు క‌నిపిస్తున్న ఉత్సాహం..గ‌డ‌చిన 40 ఏళ్ల‌ల్లో ఎన్న‌డూ క‌నిపించ‌లేద‌ని కూడా త‌న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీని గుర్తు చేసుకున్నారు. ఇక ఆ త‌ర్వాత త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో మాత్ర‌మే అభివృద్ధి జ‌రిగింద‌న్న మాట‌ను వినిపించిన చంద్ర‌బాబు... ఆ విష‌యం నిజ‌మేనా? అని ప్ర‌శ్నించారు.

అంతేకాకుండా నిజ‌మేన‌ని చేతులు ఊపండంటూ జ‌నాన్ని కోరారు. అయితే ఆ జ‌నంలో క‌నీసం ప‌దో వంతు మంది కూడా చేతులు లేప‌కపోగా, పైకి లేచిన ఆ 10 శాతం మంది చేతుల్లోనూ కొన్ని చేతులు అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న సంజ్ఞ‌లు చేశారు. ఇక మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికి ఏడాది లేదంటే రెండేళ్ల‌లో తాగు నీటిని ఇంట ముంగిటే అందిస్తాన‌ని, దీనిని స్వాగ‌తిస్తున్న‌ట్లు అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని బాబు కోరారు. అయితే జ‌నంలో పెద్ద‌గా స్పంద‌న రాక‌పోగా... క‌లిసిన రెండు చేతులు కూడా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. క‌లిసి క‌నిపించిన కొద్దిపాటి రెండు చేతులు కూడా పెద్ద‌గా చ‌ప్పుడు చేయ‌లేదు. వెర‌సి బాబు మార్కు చ‌ప్ప‌ట్లు నిజంగానే అక్క‌డ శ‌బ్ధం చేయ‌లేక‌పోయాయి. ఈ త‌ర‌హాలో త‌న ప్ర‌సంగానికి జ‌నం ఏమాత్రం స్పందించ‌కున్నా కూడా బాబు త‌న‌దైన శైలి ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూనే ముందుకు సాగిపోతుండ‌టం గ‌మ‌నార్హం.



Tags:    

Similar News