రోశ‌య్య‌ను త‌ట్టుకోలేకే ఎన్టీఆర్ మండ‌లి ర‌ద్దు..!

Update: 2021-12-01 18:28 GMT
మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య హ‌ఠాన్మ‌ర‌ణం రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌లిచివేసింది. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రికీ ఇష్టుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఆయ‌న ఏప‌క్షంలో ఉన్నా అంద‌రి ప‌క్ష‌పాతం వ‌హించేవారు. అందుకే ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో ఎవ‌రితోనూ విభేదాలు లేవు.

ఆప్యాయ‌త‌లు త‌ప్ప‌. అప్ప‌టి ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావుకు కూడా రోశ‌య్య ఎంతో ఇష్టం. రాజ‌కీయ‌ప‌రంగా స‌భ లోప‌ల‌ ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు ఎన్ని చేసుకున్నా స‌భ బ‌య‌ట క‌లిసిన‌పుడు ఆప్యాయ‌త‌లు చూపించుకునేవారు.

రోశ‌య్య నిర్వ‌హించ‌ని ప‌ద‌వులు అంటూ లేవు. ఆర్థిక మంత్రి హోదాలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏకంగా 15సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. ఎవరూ వేలెత్తి చూప‌ని విధంగా బ‌డ్జెట్ వంట‌ను వండి తీసుకొచ్చేవారు అసెంబ్లీకి.

ఆర్థికం త‌ర్వాత రోశ‌య్య ఎక్కువగా నిర్వ‌హించిన‌వి ర‌వాణా, విద్య‌త్తు శాఖ‌లు. ఆయ‌న స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న సేపు ఎవ‌రూ స‌భ విడిచి బ‌య‌ట‌కు వెళ్లిన సంద‌ర్భాలు లేవు. దీన్ని బ‌ట్టే చెప్పొచ్చు రోశ‌య్య మాట‌ల చ‌తుర‌త ఏపాటిదో.

కాంగ్రెస్ హయాంలో అంద‌రి ముఖ్య‌మంత్రుల వ‌ద్ద మంచి మార్కులు కొట్టేశారు రోశ‌య్య‌. ఏ ముఖ్య‌మంత్రి వ‌చ్చినా పార్టీలో ఆయ‌న 2వ స్థానంలోనే ఉండేవారు.

రోశ‌య్యకు ఎమ్మెల్సీ ప‌ద‌వి అంటేనే ఇష్టం. ఆయ‌న ఏనాడూ విధాన‌స‌భ‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. 1968 నుంచి 2010 వ‌ర‌కు త‌న రాజ‌కీయ జీవితంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్సీగానే ఎన్నిక‌య్యారు. రెండు సంద‌ర్భాల్లో త‌ప్ప‌. అవి కూడా ఆయ‌న ప్ర‌మేయం లేకుండానే పార్టీ ఆదేశానుసారం చేయాల్సి వ‌చ్చింది. ఒక‌సారి ఎంపీ, ఒక‌సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌త్య‌క్ష చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగుపెట్టారు.

అప్ప‌టి ముఖ్య‌మంత్రి నందమూరి తార‌క‌రామారావు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కూడా రోశయ్యే. ఎన్టీఆర్‌కు స‌భ‌లో చుక్క‌లు చూపించేవారు రోశ‌య్య‌. ఆయ‌న వాగ్ధాటిని త‌ట్టుకోలేని రామారావు ఏకంగా శాస‌న మండ‌లినే ర‌ద్దు చేశారు.

ఒక్క‌రి కోసం మండ‌లిని ర‌ద్దు చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్టీఆర్ మాత్రం ఖ‌ర్చుల మిగులుబాటు కార‌ణాన్ని చూపించారు. మ‌ళ్లీ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాతే మండ‌లిని పున‌రుద్ధ‌రించారు. వైఎస్ హ‌యాంలో కూడా మ‌రొక‌సారి ఎమ్మెల్సీ ప‌ద‌వి నిర్వ‌హించారు రోశ‌య్య‌.
Tags:    

Similar News