జైట్లీ గారూ... ఇవేం లెక్క‌లండీ బాబూ!

Update: 2017-08-31 10:30 GMT
పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశంలోని న‌ల్ల ధ‌నాన్ని ఏరేశామంటూ గొప్ప‌లు చెప్పుకున్న నరేంద్ర మోదీ స‌ర్కారు... ఇప్పుడు ఆ మాట‌ను నిరూపించుకునేందుకు నానా తంటాలు ప‌డాల్సి వస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశంలోని న‌ల్ల‌ధ‌న‌మంతా బ్యాంకుల‌కు చేరింద‌ని, అంటే దాదాపుగా న‌ల్ల కుబేరులంతా బికారులు అయిపోయార‌ని మోదీ స‌ర్కారు ఓ రేంజిలో గొప్ప‌గా ప్ర‌క‌ట‌న చేసింది. అయితే నిన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో మోదీ స‌ర్కారు మాట ఉత్త మాటేనని తేలిపోయింద‌న్న వాద‌న వినిపించింది. అప్ప‌టిదాకా సైలెంట్‌ గా కూర్చున్న విప‌క్షాల‌న్నీ ఒక్క‌సారిగా మోదీ స‌ర్కారుపైకి ఉరికి వ‌చ్చేశాయి. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఏం సాధించారంటూ ప‌లువురు ప్ర‌శ్నించ‌గా... కాంగ్రెస్ పార్టీ సీన‌య‌ర్ నేత‌ - కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబ‌రం అయితే మ‌రో అడుగు ముందుకేసి... ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యం సిగ్గు చేటైన నిర్ణ‌య‌మేన‌ని తేల్చి పారేశారు.

మ‌రోవైపు రాహుల్ గాంధీ కూడా మోదీ స‌ర్కారుపై త‌న ప‌దునైన విమ‌ర్శ‌ల‌ను గుప్పించారు. ఇక సైలెంట్‌ గా ఉంటే ఈ విమ‌ర్శ‌ల గాఢ‌త మ‌రింత పెరిగే ప్ర‌మాద‌ముంద‌ని గ్ర‌హించిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగిపోయారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వినిపించిన వాద‌న‌లో అస‌లు ప‌సే లేద‌ని - అస‌లు ఆయ‌న వినిపించిన వాద‌న ఏ ఒక్క‌రికైనా అర్థ‌మైందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అక్ర‌మాన్ని స‌క్ర‌మంగా చూపించుకునేందుకు జైట్లీ చేసిన య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింద‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. అస‌లు ఈ త‌ర‌హా లెక్క‌లు చెప్ప‌డం ఒక్క జైట్లీకి మాత్ర‌మే సాధ్య‌మైంద‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి.

అయినా విప‌క్షాల విమర్శ‌ల‌పై స్పందించిన జైట్లీ చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యానికి వ‌స్తే...  రద్దైన నోట్లన్నీ బ్యాంకులో డిపాజిట్‌ అయినంతమాత్రాన ఆ సొమ్ముంతా చట్టబద్ధమేనని అర్థం కాదని ఆయన అన్నారు. 'పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనం పూర్తిగా నిర్మూలన అయినట్టు కాదు' అని కూడా ఆయ‌న పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు - జీఎస్టీ ప్రత్యక్ష పన్ను ఆదాయానికి గణనీయమైన ఊతాన్ని ఇచ్చాయని, చాలామంది ప్రజలు పన్ను పరిధిలోకి వచ్చారని చెప్పారు. భారీగా రద్దైన నోట్లు బ్యాంకులో డిపాజిట్‌ అయినా.. ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని - ఎక్కువ డబ్బు అధికారిక వ్యవస్థలో భాగం కావడం ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా బ్యాంకుల్లోకి వ‌చ్చిన న‌ల్ల‌ధ‌న‌మంతా... తెల్ల ధ‌న‌మైన‌ట్టేన‌న్న వాద‌న‌ను తిప్పికొడుతూ జైట్లీ చేసిన వ్యాఖ్య‌ల్లో అస‌లు వాస్త‌వ‌మే లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయినా త‌మ ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు జైట్లీ వితండ వాదానికి దిగుతున్నార‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు. అయితే ఈ విష‌యంలో జైట్లీ లెక్క‌లు నిజంగానే కాస్తంత తేడాగా ఉన్నాయ‌న్న వాద‌న గ‌ట్టిగానే వినిపిస్తోంది.
Tags:    

Similar News