రూ.27 కోట్ల విలువైన వాచ్‌ను ప‌ట్టుకున్న అధికారులు.. ఎక్క‌డంటే!

Update: 2022-10-07 11:33 GMT
విదేశాల నుంచి అక్ర‌మంగా విలువైన వ‌స్తువుల‌ను తెస్తుంటే క‌స్టమ్స్ అధికారులు విమానాశ్ర‌యాల్లో త‌నిఖీలు చేసి స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఏకంగా రూ.27 కోట్ల విలువైన వాచీని ప‌ట్టుకున్నారు. ఇది వైట్ గోల్డ్ వాచ్ అని.. ఇందులో వ‌జ్రాలు పొదిగార‌ని.. అందుకే దీని విలువ రూ.27 కోట్ల రూపాయ‌ల‌ని చెబుతున్నారు.

ఈ వాచీని క‌స్ట‌మ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్ర‌యంలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు రిస్ట్ వాచీల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇవ‌న్నీ కోట్ల రూపాయ‌లు చేస్తాయ‌ని చెబుతున్నారు. ఈ ఏడింటిలో ఒక‌టి వైట్ గోల్డ్ వాచీ అని దీని విలువ ఏకంగా రూ.27 కోట్ల రూపాయ‌ల‌ని అంటున్నారు.

దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్‌లెట్‌, ఐఫోన్ 14 ఫోన్‌ను సైతం సీజ్‌ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకే క‌స్ట‌మ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నార‌ని వెల్ల‌డించారు.

కాగా అమెరికా జ్యుయెల్ల‌రీ, వాచ్‌ తయారీ సంస్థ... జాకబ్‌ అండ్‌ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు వివ‌రించారు. దుబాయ్ ప్ర‌యాణికుడి ద‌గ్గ‌ర స్వాధీనం చేసుకున్న‌ మొత్తం వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఇంత భారీ స్థాయిలో పట్టుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఏడు గ‌డియారాల విలువ‌, బ్రేస్‌లెట్ విలువ‌ 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు.

కస్టమ్స్ కమిషనర్ జుబైర్ రియాజ్ కమిలీ మాట్లాడుతూ.. విలాసవంతమైన, అత్యంత విలువైన వస్తువులను సీజ్ చేశామ‌ని.. ఇలాంటి వాటిలో ఇదే అతిపెద్ద కేసు అని వివ‌రించారు.

నిందితుడైన ప్రయాణికుడు భారతీయుడని చెప్పారు. అతడు దుబాయ్ నుండి పరిమితికి మించి జాకబ్ అండ్ కో బిలియనీర్ వైట్ డైమండ్స్ వాచ్, ఆరు ఖరీదైన రోలెక్స్, పియాజెట్ వాచీలు, డైమండ్ పొదిగిన బ్రాస్లెట్ లు, ఐఫోన్ 14 తీసుకువచ్చారని వివ‌రించారు. వాటిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News