ఇంట్లో ఉండలేకపోతున్నారా నన్నడగండి- ఒమర్

Update: 2020-03-25 04:30 GMT
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. దేశాలకు దేశాలు షట్ డౌన్  - లాక్ డౌన్ లతో కరోనాబారిన పడకుండా ఉండేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ లోని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కరోనాపై చేస్తోన్న అప్రకటిత యుద్ధంలో చాలామంది ప్రజలు సహకరిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ, రోజూ కాలికి బలపం కట్టుకొని బయట తిరిగే కొందరు మాత్రం...కాలుగాలిన పిల్లిలా ఇంట్లో ఉండలేక మగ్గిపోతున్నారు. జైలు పక్షుల్లా కాలం వెళ్లదీస్తోన్న ఆ కొందరు....లాక్ డౌన్ ఎప్పుడెపుడు పూర్తవుతుందా....రెక్కలు వచ్చిన పక్షిలా ఎపుడు ఎగిరిపోదామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, క్వారంటైన్ లో ఉండేందుకు ఇబ్బందిపడేవారందరికీ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా టిప్స్ ఇస్తానంటున్నారు.  లాక్ డౌన్ - క్వారంటైన్ లలో నెలల తరబడి గడిపిన అనుభవం తనకుందంటూ సెటైరికల్ ట్వీట్స్ చేశారు ఒమర్.

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేసినప్పటి నుంచి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం(హౌస్ అరెస్ట్ లేదా క్వారంటైన్)లో ఉంచిన సంగతి తెలిసిందే. దాదాపు 8 నెలల తరవాత ఒమర్ అబ్దుల్లాపై ఉన్న నిర్బంధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం ప్రకటన చేయడంతో ఒమర్ విడుదలయ్యారు. ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఒమర్ తో పాటు పలువురు కశ్మీరీ నేతల హౌస్ అరెస్టులపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలందరూ క్వారంటైన్ లో ఉండాలంటూ నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్..క్వారంటైన్ - లాక్ డౌన్ పై సరదాగా సెటైర్లు వేశారు. తన మాటలను సీరియస్ గా తీసుకోవద్దన్న ఒమర్....లాక్ డౌన్ - క్వారంటైన్ ల పై టిప్స్ ఇస్తానంటున్నారు. అంతేకాదు, నెలల తరబడి క్వారంటైన్ లో ఉన్న అనుభవం తనకుందని, త్వరలోనే ఆ విషయాలపై ఓ బ్లాగ్ కూడా రాస్తానని ట్వీట్ చేశారు ఒమర్. ఎంతైనా ఒమర్ సరదా మనిషంటూ కొందరు రీట్వీట్స్ చేస్తున్నారు. ఒమర్ లోని హాస్యచతురత ఇంకా అలాగే ఉందంటూ ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ రీట్వీట్ చేశారు. క్వారంటైన్ లో ఉన్నా...సెటైరికల్ నేచర్ తగ్గలేదంటూ ఒకరు...ఆ అనుభవాలను స్వయంగా చూసేందుకే మిమ్మల్ని క్వారంటైన్ చేశారంటూ మరొకరు కామెంట్స్ చేశారు.
Tags:    

Similar News