ఇన్నాళ్ల తర్వాత పెదవి విప్పిన ఒమర్.. ఎంతలా ఫైర్ అయ్యారంటే?

Update: 2022-03-19 04:25 GMT
ది కశ్మీర్ ఫైల్స్ మూవీ విడుదలైన తర్వాత.. ఆ సినిమాల్ని చూసిన వారిలో చాలామంది.. ఈ మూవీ మీద జమ్ముకశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసి.. తన మాటలతో చాలామంది మనసుల్ని దోచుకునే ఒమర్ అబ్దుల్లా ఎలా రియాక్టు అవుతారన్న ప్రశ్న కలిగింది. ఇప్పుడా సందేహం తీరిపోయింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ సినిమాతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ఈ సినిమాపై స్పందించారు.

కొందరు అంచనా వేసిన రీతిలోనే.. ఒమర్ స్పందన ఉండటం గమనార్హం. ఈ సినిమాలోచాలా తప్పుడు విషయాల్ని చూపించారన్నారు. కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడుల గురించి ఆయన ప్రస్తావిస్తూ.. పండిట్లపై దాడులు జరిగిన సమయంలో నేషనల్ కాన్ఫరెన్సు ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగా చూపించారని.. కానీ ఆ సమయంలో కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఉందన్నారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న వేళలో.. కశ్మీర్ లో గవర్నర్ జగ్ మోహన్ పాలన కింద ఉండేదన్నారు.

ఇక.. దాడుల్లో కశ్మీర్ పండిట్లు మరణించటం విచారకరమన్న ఒమర్ అబ్దుల్లా.. అల్లర్ల కారణంగా ఎంతో మంది ముస్లింలు.. సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ.. ఒమర్ మాటలే నిజమని అనుకుందాం.

అల్లర్లలో మరణించిన ముస్లింల సంఖ్య ఎంత? వారిని చంపిందెవరు? వారి వివరాలు ఏమిటి? వాటి గురించి ఇప్పటివరకు ఎందుకుప్రస్తావించలేదు? లాంటి ప్రశ్నలకు ఒమర్ సమాధానాలు చెప్పాల్సిన ఉంటుంది.

కశ్మీర్ నుంచి వలస వెళ్లింది పండిట్లు మాత్రమే కాదని.. ముస్లింలు కూడా వెళ్లారని.. వారిలోచాలామంది తిరిగి రాలేదన్నారు. ఒకవేళ అదే నిజమైతే.. కశ్మీర్ వ్యాలీని విడిచి పెట్టి వెళ్లిన కశ్మీర్ ముస్లింలు పండిట్ల మాదిరి ఎక్కడో ఒక క్యాంపులో తలదాచుకోవాలి కదా? వారున్న ప్రాంతాల గురించిన వివరాలు కూడా ఒమర్ వెల్లడిస్తే బాగుంటుంది.

అయినా.. ఒక బాలీవుడ్ సినిమా వచ్చే వరకు కూడా కశ్మీరీ ముస్లింలు కశ్మీరీ వ్యాలీని భయంతోవిడిచిపెట్టి వెళ్లిపోయిన విషయాన్ని ఇప్పటివరకుఎందుకు బయటపెట్టనట్లు? ఇంతకీ కశ్మీరీ ముస్లింలను భయపెట్టినోళ్లు ఎవరంటారు ఒమర్ అబ్దుల్లా? ఏమైనా.. ఒమర్ తాజా మాటలు విన్నప్పుడు.. ఆయన నుంచి ఇంతకు మించి ఇంకేమీ ఆశించటం సరికాదన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News