ప్రపంచానికి సరికొత్త సవాల్ ఒమ్రికాన్

Update: 2021-11-27 04:04 GMT
ప్రపంచానికి సరికొత్త పీడగా మారింది ఒమ్రికాన్. ఇదేం పేరండి? ఇప్పటివరకు వినలేదే అనుకోవచ్చు. కానీ.. ఇకపై దీని గురించి నిత్యం వినటమే కాదు.. దీని మీదే రానున్న రోజులు ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవటం.. మరింత బలోపేతం కావటం తెలిసిందే.

ఆ మధ్యన డెల్టా వేరియంట్ చేసిన విధ్వంసం ఎంతన్నది తెలిసిందే. ఇప్పుడు దాని అమ్మ మొగుడు అన్న రీతిలో విరుచుకుపడుతోంది.. తాజా వేరియంట్ ఒమ్రికాన్. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ సరికొత్త రకం కొవిడ్ వేరియంట్.. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్లలో ఇదొకటిగా చెబుతున్నారు.

దాదాపు రెండేళ్లుగా కరోనా కారణంగా కిందా మీదా పడుతున్న ప్రపంచానికి ఒమ్రికాన్ మరో తలనొప్పిగా మారింది. ఇప్పుడిప్పుడే కరోనా కోరల నుంచి బయటపడుతున్న వేళ.. ఇప్పుడు తెర మీదకు వచ్చిన ఈ వేరియంట్ ఇప్పటికే తన రచ్చను షఉరూ చేసింది. ఒమ్రికాన్ సాంకేతిక నామం బి1.1.529గా పేర్కొనే ఈ మహమ్మారి దక్షిణాఫ్రియాలో మొదలై.. ఇప్పుడు దాని పొరుగుదేశమైన బోట్స్ వానాతో పాటు హంకాంగ్ కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్.. బెల్జియంలోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

షాకింగ్ విషయం ఏమంటే.. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికీ ఈ వేరియంట్ వదలటం లేదంటున్నారు. ఇప్పటివరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లలో డెల్టా వేరియంట్ చాలా సీరియస్ అయినదిగా చెబుతారు. దాంతో పోలిస్తే.. ఒమ్రికాన్ మరింత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. వేగంగా వ్యాపించటం.. తీవ్ర లక్షణాలతో విరుచుకుపడటం.. దీనికున్న ప్రత్యేక లక్షణంగా చెబుతున్నారు. ఈ కారణంతోనే నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒమ్రికాన్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు ప్రభావితమయ్యాయి. ఐరోపా.. ఆసియాలోని ప్రధాన ఇండెక్స్ లు కుదేలయ్యాయి. ముడి చమురు ధరలు ఏడు శాతం తగ్గితే.. ఎయిర్ లైన్స్ షేర్లు భారీగా దెబ్బ తిన్నాయి. సౌతాఫ్రికాలో యావరేజ్ గా సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు. నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి కారణం ఏమిటన్నది అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.

ఇదిలా ఉంటే.. మలావి నుంచి ఇజ్రాయెల్ కు వచ్చిన ఒక వ్యక్తికి ఈ కొత్త రకం ఒమ్రికాన్ వేరియంట్ సోకింది. మరో ఇద్దరు కూడా దీని బారిన పడటంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది.

దీనికి కారణం.. వీరంతా పూర్తిస్థాయిలో కరోనా టీకాలు తీసుకున్న వారే కావటం. టీకాలు తీసుకున్న తర్వాత కూడా ఈ వైరస్ సోకటంతో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో దక్షిణాఫ్రికాతో సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీయుల మీద ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. ఆ ఆరు దేశాలు ఏమంటే..

1. దక్షిణాఫ్రికా
2. బోట్స్ వానా
3. లెసాతో
4. ఎస్వాతిన్
5. జింబాబ్వే
6. నమీబియా

అయితే.. ఇప్పటివరకు ఈ వేరియంట్ కేసులు భారత్ లో నమోదు కాలేదని చెబుతున్నారు. కొత్త వేరియంట్ ను పర్యవేక్షిస్తున్నామని.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమ్రికాన్ తో అంత ఆందోళన చెందటానికి కారణం.. చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల కలయికగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీర రోగ నిరోధక శక్తిని ఇది ఏమార్చే గుణం దీనికున్న దుర్మార్గమైన లక్షణం.

ఈ వేరియంట్ కానీ వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే శక్తి సామర్థ్యాలు ఉంటే.. మునుపటి డెల్టా కంటే తీవ్రంగా వ్యాపించే సామర్థ్యం ఉంటే.. ప్రపంచానికి తిప్పలు తప్పనట్లే. డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఒమ్రికాన్ లో స్పైక్ ప్రోటీన్ రెట్టింపుగా చెబుతున్నారు.


Tags:    

Similar News