ఒంగోలు వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవర్ని కలిశాడు?

Update: 2020-03-19 16:03 GMT
ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ వ్యక్తి ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. అయితే అతడు కరోనా వైరస్ బారిన పడ్డాడని గురువారం తెలిసింది. వైరస్ సోకిందని తెలియక ముందు అతడు వైరస్ తోనే తిరిగాడని తెలుస్తోంది. లండన్‌ నుంచి ఒంగోలుకు వచ్చిన ఆ యువకుడు ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరిని కలిశాడు.. ఎక్కడ ఉన్నాడనే వివరాలు వైద్యాధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ పరిణామంపై ప్రకాశం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అత్యవసర సమీక్ష నిర్వహించి ఆ యువకుడి ట్రావెల్ హిస్టరీ అంతా పరిశీలిస్తున్నారు.

ఈ నెల 13వ తేదీన లండన్ నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ఏసీ బస్సులో చేరుకున్నాడు. మంగమూరు రోడ్డులోని తన నివాసం ఉన్న జెడ్పీ కాలనీకి చేరుకున్నాడు. ఈనెల 14వ తేదీన గుంటూరు వెళ్లి తిరిగి ఒంగోలులోని తన ఇంటికి చేరుకున్న ఆ యువకుడు 15వ తేదీన అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఆస్పత్రి లో చేరగా కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఒంగోలు రిమ్స్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించడం తో ఆ వ్యక్తి రక్త పరీక్ష నమూనాలను విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపించారు. ఎర్రర్‌ రావడంతో స్వాబ్స్‌ను వైద్యులు తిరుపతి లోని వైరాలజీ ల్యాబ్‌ కు పంపించారు.

కోవిడ్‌-19 గా తేలడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు బాధితుడితో పాటు కుటుంబసభ్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆ యువకుడికి కరోనా వైరస్ ఢిల్లీ, హైదరాబాద్, గుంటూరులలో తిరగడంతో అక్కడి అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఎందుకంటే కరోనా వైరస్ తో ఆయన ఆ ప్రాంతాలు తిరగడంతో ఆయన తిరిగిన ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం అక్కడ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు తిరిగిన ప్రాంతాలను పరిశీలిస్తుండగా.. అతడు కలిసిన వ్యక్తులను ఆరా తీస్తున్నారు.

ఇక హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ఏసీ బస్సులో రావడంతో అతడితోపాటు బస్సులో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికేమైనా సోకిందేమోనని అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా కరోనా వైరస్ చేసిన ప్రతి పని.. తిరిగిన ప్రతి ప్రాంతం వాకబు చేసి అక్కడ ఇతరులకు ఆ వైరస్ వ్యాపించకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Tags:    

Similar News