గొప్ప‌లు స‌రే..అహంకారం ఎక్కువ అవుతోంది షా

Update: 2018-04-07 05:22 GMT
సాధించిన విజ‌యాల్ని చెప్పుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అవ‌న్నీ ఎలాంటి ప‌రిస్థితుల్లో త‌మ‌కు వ‌చ్చాయో.. అందులో ప్ర‌జ‌ల పాత్ర ఎంత ఉంద‌న్న‌ది చెప్ప‌టం రాజ‌కీయ అధినేత‌ల‌కు ముఖ్యం. మిగిలిన రంగాల్ని ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయాల్లో నేత‌ల విజ‌యాల‌న్నీ ప్ర‌జ‌ల‌తో లింకెట్టి ఉంటాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అందుకే తెలివైన నాయ‌కుడు ఎవ‌డూ కూడా తాను సాధించిన విజ‌యాల్ని త‌న ఖాతాలో వేయ‌కుండా.. ప్ర‌జ‌ల ఖాతాలో వేస్తూ.. త‌న‌కు అధికారాన్ని అందించారంటూ విన‌మ్ర‌త‌తో చెబుతుంటారు.

ప్ర‌త్య‌ర్థి పార్టీల్ని త‌ప్పు ప‌ట్టే వేళ‌లోనూ.. విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలోనూ ప్ర‌జాకోణం నుంచే వ్యాఖ్య‌లు చేస్తారే త‌ప్పించి.. తాను అంత మొన‌గాడిన‌ని.. ఇంత పోటుగాడిన‌ని అంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపించ‌దు. కానీ..ప‌వ‌ర్ త‌ల‌కు ఎక్కేసిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి నోటి నుంచి మాత్రం ఇప్పుడు అందుకు భిన్న‌మైన మాట‌లు వ‌స్తున్నాయి. తామంత పోటుగాళ్లు మ‌రెక్క‌డా ఉండ‌ర‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం ఎక్కువ అవుతోంది.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని త‌ప్పు ప‌ట్టాల‌నుకున్న‌ప్పుడు వారి త‌ప్పుల్ని నిర్మాణాత్మ‌కంగా ఎత్తి చూపించాల‌ని.. ప్ర‌జ‌ల కోసం వారేమీ చేయ‌టం లేద‌న్న ప్ర‌స్తావ‌న తీసుకురావాలే కానీ.. త‌మ శ‌క్తిని చాటుకునేలా.. గొప్ప‌లు చెప్పుకున్న చందంగా అస్స‌లు ఉండ‌కూడ‌దు. కానీ.. ఆ త‌ర‌హా త‌ప్పుల్ని ప‌దే ప‌దే చేస్తున్నారు అమిత్ షా.

తాజాగాపార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ తీరును త‌ప్పు ప‌ట్టే క్ర‌మంలో ఆయ‌న ఉప‌యోగించిన మాట‌ల‌న్నీ ఆయ‌న‌లోని అహంకారాన్ని చెప్పేలా ఉన్నాయి త‌ప్పించి.. త‌మ విజ‌యంలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని ప్ర‌స్తావించ‌టాన్ని మ‌ర్చిపోవ‌టం గ‌మ‌నార్హం.

36 ఏళ్ల క్రితం వాజ్ పేయ్ పార్టీని ప్రారంభించార‌ని.. క‌మ‌లం విక‌సిస్తుంద‌ని నాడే చెప్పార‌న్నారు. 10 మందితో ప్రారంభ‌మైన పార్టీ నేడు ప్ర‌పంచంలోనే అతి పెద్ద పార్టీగా 11 కోట్ల మంది కార్య‌క‌ర్త‌ల‌తో విక‌సిస్తోంద‌న్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధిక్యం సాధించిన‌ప్ప‌టికీ తాము మిత్ర‌ప‌క్షాల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించిన‌ట్లుగా చెప్పారు. 2019లోనూ బీజేపీకి అధిక్య‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ  ఎన్డీయే ప్ర‌భుత్వాన్నే ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. మ‌రిన్ని చెప్పిన అమిత్ షా.. త‌మ మిత్రులుగా ఉన్న శివ‌సేన‌.. టీడీపీ లాంటి పార్టీలు త‌మ నుంచి ఎందుకు దూర‌మ‌వుతున్నాయో చెబితే బాగుండు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 36 ఏళ్ల క్రితం ప‌ది మందితో పార్టీ ప్రారంభ‌మైంద‌ని చెబుతున్న షా.. మ‌రి ఆ ప‌దిమందిలో ఒక‌రైన అద్వానీని తాను కానీ ప్ర‌ధాని మోడీ కానీ ఎందుకంత చిన్న‌చూపు చూస్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి. ముదిమి వ‌య‌సులో త‌న శిష్యుడికి విన‌మ్ర‌త‌తో న‌మ‌స్కారం చేస్తే.. ప్ర‌తి న‌మ‌స్కారం కూడా చేయ‌ని మోడీ సంస్కారం దేశ ప్ర‌జ‌లు గమ‌నిస్తూనే ఉన్నార‌న్న విష‌యాన్ని అమిత్ షా లాంటోళ్లు గుర్తిస్తే మంచిది. లేకుంటే.. ఎక్క‌డ మొద‌లైందో.. అక్క‌డికే చేరే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News