అందమైన అసెంబ్లీ మనకు పోయినట్లే..

Update: 2016-03-26 11:30 GMT
అయ్యవారిని చేయబోతే కోతి అయిందని ఓ సామెత. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాల డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెబుతున్నా కూడా పత్రికల్లో ఆ డిజైన్లు చూసినవారు నవ్వుకుంటున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ డిజైన్లు అంటే ఇంత అధ్వానంగా ఉంటాయనుకోలేదని నవ్వుతున్నారు. ముఖ్యంగా జపాన్ కు చెందిన మకీ అండ్ అసోసియేట్సు సంస్థ ఏపీ అసెంబ్లీ - కౌన్సిల్ - హైకోర్టులను డిజైన్ చేసింది. ఆ సంస్థ గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. పత్రికలూ తెగ గొప్పలు రాశాయి. ప్రపంచంలోని గొప్పగొప్ప నిర్మాణాలను డిజైన్ చేసింది ఈ జపాన్ సంస్థేనని చెబుతున్నారు. కానీ, శాసనసభ కోసం ఆ సంస్థ ఇచ్చిన డిజైన్ చూస్తే ఏదో ఫ్యాక్టరీని చూస్తున్నామా అనిపిస్తోంది. జపాన్ లో ఉండే అణు విద్యుత్ ప్లాంట్లలా అది కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఏపీ అసెంబ్లీతో దాన్ని పోల్చుకుని జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణకు కోల్పోతున్న మన అసెంబ్లీ భవనం స్థానంలో కొత్తది ఇంకా అద్భుతంగా ఉంటుందని అనుకుంటే అసలు శాసన కేంద్రంలానే లేదని అంటున్నారు.

అమరావతి చరిత్ర - వారసత్వం వంటివన్నీ ఘనంగా చెప్పిన చంద్రబాబు ప్రస్తుత అసెంబ్లీ నమూనాలో అవేమీ ప్రతిబింబించేలా చేయలేకపోయారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని అసెంబ్లీని చూస్తే అద్భుత  నిర్మాణ శైలి అందులో కనిపిస్తుంది. తెల్లని రంగులో చిన్నచిన్న చెక్కడాలతో చూపు తిప్పుకోనివ్వని సౌందర్యం ఆ భవంతిది. ఎదురుగా ఉన్న భారీ మహాత్ముని విగ్రహం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అసెంబ్లీ ముందు నుంచివెళ్లే ఇతర ప్రాంతాలు వారెవరైనా సరే ఆగి చూడాల్సిందే.

ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎలా ఉంది..?

ఇండియాలో కొన్ని అసెంబ్లీ భవనాలుమాత్రమే అందమైనవిగా, ఆకట్టుకునేవిగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఏపీ - తెలంగాణ సభలు జరుగుతున్న అసెంబ్లీ భవనంలాంటి నిర్మాణం ఉన్నది కేవలం త్రిపుర అసెంబ్లీ  భవనం మాత్రమే. ఉజ్జయంత్ ప్యాలస్ గా పేరున్న దీంట్లో 2011 వరకు త్రిపుర అసెంబ్లీ నడిచింది. ప్రస్తుతం అది కొత్త భవనంలోకి మారింది. దీంతో ఏపీ అసెంబ్లీకి సరితూగే భవనం ఇంకెక్కడా లేదు.

కర్ణాటక - ఉత్తరప్రదేశ్ - రాజస్థాన్ - పశ్చిమబెంగాల్ - మణిపూర్ అసెంబ్లీలు కూడా సొగసైన భవనాలే అయినా హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందు దిగదుడుపే.  ఇక ఛత్తీస్ గఢ్ - గోవా - మహారాష్ట్ర - కేరళ - తమిళనాడు అసెంబ్లీలు నిర్మాణ పరంగా ఆదునిక శైలిలో ఉంటాయి. కానీ, వీటిలోనూ ఒకట్రెండు తప్ప కొత్తదనం కనిపించదు.

ఇక మనకంటే ముందు కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఛత్తీస్ గఢ్ - జార్ఖండ్ - ఉత్తరాఖండ్ లలో కేవలం ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ మాత్రమే అంతోఇంతో బాగుంది. అరుణాచల్ ప్రదేశ్ - అస్సాం - బీహార్ - హర్యానా - పంజాబ్ - గుజరాత్ వంటి రాష్ట్రాల శాసనసభ భవనాలు చాలా సాదాసీదాగానే ఉన్నాయి. ఒడిశా - జార్ఖండ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీలు అయితే మరీ మామూలుగా ఉంటాయి. నవ్యాంధ్ర అసెంబ్లీ భవనం వాటితో పోటీ పడుతోందా అనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో చంద్రబాబు నిర్మించబోయే అసెంబ్లీ భవనం దేశంలో టాప్ లో నిలుస్తుందని అంతా భావించారు. ఆంధ్ర సంస్కృతి - వారసత్వం - చరిత్రలతోపాటు, ఆధునికతకూ పెద్ద పీట వేస్తూ ఉంటుందని అనుకున్నారు.  తీరా ఆ డిజైన్ చూశాక జపాన్ లోని అణు రియాక్టర్లలా కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా నీరస పడ్డారు. అత్యద్భుతమైన అసెంబ్లీ భవనాన్ని తెలంగాణ రాష్ట్రానికి కోల్పోతున్న సమయంలో అంతకుమించిన నిర్మాణం మనకు ఎంతైనా అవసరమే. మకీ అసోసియేట్సు ఇచ్చిన డిజైన్ ప్రజల ఆశలు - ఆకాంక్షలు - భావోద్వేగాలు - కోరికలు దేన్నీ కనీసం టచ్ చేయలేకపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచానికి తలమానికమైన రాజధానిగా చేస్తానని... పర్యాటక స్వర్గధామంగా మారుస్తానని చంద్రబాబు చెబుతున్నా ఇలాంటి మొరటు ఆకృతులతో పర్యాటక ఆసక్తి ఎలా కలుగుతుందో అర్థం కావడం లేదు.

-- గరుడ
Tags:    

Similar News