11 ల‌క్ష‌ల 44వేల పాన్ కార్డులు ర‌ద్దు

Update: 2017-08-02 07:05 GMT
కేంద్ర ప్ర‌భుత్వం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 11 ల‌క్ష‌ల 44 వేల పాన్ కార్డులను ర‌ద్దుచేసింది. ఇదేదో అంచ‌నా అనుకునేరు. కాదు అధికారిక స‌మాచారం. కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి సంతోష్ కుమార్‌ గంగ్వార్ సాక్షాత్తు పార్ల‌మెంట్‌ లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్థిక అక్ర‌మాల విష‌యంలో కొర‌డా ఝ‌లిపిస్తోంద‌ని తెలిపారు. ఇందులో భాగంగా రెండు పాన్ కార్డులు క‌లిగి ఉన్న వారికి సంబంధించిన 11 ల‌క్ష‌ల 44వేల పాన్ కార్డుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి వివ‌రించారు.

``ఒక వ్య‌క్తికి ఒకే పాన్ కార్డు క‌లిగి ఉండాల‌నే నిబంధ‌న ఉన్నప్ప‌టికీ వాటి ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో న‌కిలీ పాన్ కార్డు క‌లిగి ఉండ‌టం, రెండో పాన్ కార్డు పొంద‌టం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని జూలై 27 నాటికి 11 ల‌క్ష‌ల 44 వేల 211 పాన్ కార్డుల‌ను ర‌ద్దు చేయ‌డం లేదా డీయాక్టివేట్ చేయ‌డం జ‌రిగింది`` అని రాజ్య‌స‌భ‌లో ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై స‌భ‌లో విస్తృత చ‌ర్చ జ‌రిగింది. దాదాపుగా 900 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు వెల‌వ‌డింద‌ని అన్నారు. రూ.7961 మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు.

మ‌రోవైపు నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు మంగళవారం లోక్‌ సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాయి. అనుబంధ డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇప్పటివరకు రద్దయిన పెద్ద నోట్లు బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్ అయ్యాయని, కొత్తగా ఎన్ని నోట్లు ముద్రించారని, నల్లధనం ఏ మేరకు బయటపడిందని ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం వేగంగా వెళుతున్న కారు టైరును తుపాకీతో కాల్చినట్టుగా ఉందని ఆయన అభివర్ణించారు.

మ‌రోవైపు కొద్దికాలం మాత్రమే నిల్వ ఉండగల ఆహార పదార్థాల ప్యాకెట్లపై బెస్ట్ బిఫోర్ (నిర్దిష్ట తేదీలోగా తినాలి) అన్న హెచ్చరికను కంపెనీలు ముద్రించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ వస్తువులు) నిబంధనలు 2011లో కొత్త నిబంధనను చేర్చామని వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి లోక్‌సభకు తెలిపారు. దేశంలో 2014 నుంచి 2016 మధ్యకాలంలో 288 పరువు హత్యలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2016లో దేశవ్యాప్తంగా 35 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వీటిలో అత్యధికంగా హర్యానాలో 12 - ఉత్తరప్రదేశ్‌ లో ఆరు - కర్నాటక - కేరళల్లో మూడు చొప్పున తెలంగాణ - మహారాష్ట్రలో ఒక్కో కేసు నమోదైందని తెలిపింది. దేశంలో పలు సామాజిక మాధ్యమాలకు చెందిన 652 వెబ్‌ సైట్లను రద్దు చేశామని ప్రభుత్వం తెలిపింది.
Tags:    

Similar News