ఒట్టేసి చెప్పు.. నారాయణకే మీ ఓటు

Update: 2019-04-04 04:48 GMT
అధికారంలో ఉన్నాం.. పైగా అపరకుభేరుడు పోటీచేస్తున్నారు.. ఇంకేముందు నెల్లూరు అర్బన్ జనాలు పండుగ చేసుకుంటున్నారట.. ఎన్నికలకు ఇంకా 6 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు సామధానభేద దండపాయాలు అన్నీ ప్రయోగిస్తున్నారు. అవునన్న వారికీ కానుకలు.. కాదన్న వారికి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

ఐదేళ్లలో అన్నీ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న టీడీపీ అభ్యర్థులు ఇప్పుడు ఆ అధికార యావతో మరోసారి ప్రజలపై డబ్బుల కట్టలు వెదజల్లి మరోసారి గెలిచి దోచేయడానికి రెడీ అయ్యారని క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.

ఏపీ ఎన్నికల్లో ఈసారి డబ్బు - మద్యం ప్రవాహం కట్టలు తెగుతోంది. ఓట్లను కొనుగోలు చేయడానికి నేతలు పెద్దఎత్తున డబ్బు - బహుమానాలు - మద్యాన్ని సరఫరా చేయడానికి రెడీ అయ్యారు. మహిళా ఓటర్లకు ఇప్పటికే చీరల పంపిణీని మొదలు పెట్టారు.

నెల్లూరులో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళలకు ఏకంగా వెండి కుంకుమ భరణిలు పంపకం మొదలు పెట్టారు. వెండి కుంకుమ భరిణలు మహిళలకు సెంటిమెంట్. ప్రతీ ఇంట్లోనూ ఉండాలని..లక్ష్మీ దేవి రూపంగా కొలుస్తారు. ఆ సెంటిమెంట్ ను అనువుగా చేసుకొని వాటిని పంచుతున్నారు. వెండి కుంకుమ భరిణలు మహిళల చేతిలోపెట్టి  వారితో టీడీపీకే ఓట్లు వేయించేలా ఒట్టు వేయించుకుంటున్నారట..

నెల్లూరు అర్బన్ లో ఈ తరహా పంపిణీ పబ్లిగ్గా జరగడం మీడియా కంట పడింది. పోలింగ్ కు ఇంకా వారం రోజుల ముందే ఇంత ప్రలోభ పెడుతుంటే ఇక ఎన్నికలకు ముందు నెల్లూరు అర్బన్ లో ఎంత విచ్చలవిడిగా పంచుతారోనన్న భయం ప్రతిపక్షాల్లో కలుగుతోంది. డబ్బు - మద్యంతో ప్రజాస్వామ్యాన్ని నెల్లూరు అర్బన్ లో కూలదోస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

నెల్లూరు అర్బన్ లో బడా విద్యాసంస్థల అధినేత - పారిశ్రామికవేత్త అయిన నారాయణ పోటీచేస్తున్నారు. అఫిడవిట్ లోనే 400 కోట్ల ఆస్తులు చూపిన ఆయన నెల్లూరు అర్బన్ లో గెలవడానికి ఈసారి జోరుగా ప్రయత్నిస్తున్నారు. అందుకే నెల్లూరు జనాలు కానుకలతో ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
    

Tags:    

Similar News