జగన్ కు పరోక్షంగా చురకలంటించిన మేనమామ..!

Update: 2021-09-05 06:30 GMT
ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరమైంది. సీబీఐ రంగంలోకి దిగి రోజుకొకరిని విచారిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డిని సీబీఐ విచారించింది. అయితే ఆయనను విచారించడానికి గల కారణంపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కోణంలో కాకుండా ఆయన టీడీపీపై చేసిన ఆరోపణల ఆధారంగా విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సీఎంకు తలనొప్పిగా మారాయంటున్నారు.  ఇంతకీ జగన్ మేనమామ చేసిన వ్యాఖ్యలేంటి..? ఎందుకు జగన్ కు తలనొప్పిగా మారాయి.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డి  కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ వివేకానంద హత్య నేపథ్యంలో ఆయనను సీబీఐ కడప జైలులో  విచారించారు. శనివారం సాయంత్రం గంటకు పైగా ఆయనను సీబీఐ పలు ప్రశ్నలను వేసింది. వరుసకు బావ అయిన వైఎస్ వివేకా హత్య కేసులో రవీంద్రనాథ్ రెడ్డిని విచారించడంపై తీవ్ర చర్చ ప్రారంభమైంది. అయితే ఆయనను విచారించడానికి కారణం వేరే ఉందట.

2019 మార్చి 14న వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. ఈ  హత్యపై వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి లు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అంతకుముందు మార్చి 28న ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వివేకా నంద వద్ద పీఏగా ఉన్న ఎం.వి. క్రిష్టారెడ్డితో పాటు యెర్ర గంగిరెడ్డి, ప్రకాశ్ అనే ముగ్గురు సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంతో వారిని కోర్టులో హాజరుపరిచారు.

ఇదిలా ఉండగా వైఎస్ వివేకా హత్యపై టీడీపీ, వైసీపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. టీడీపీ, వైసీపీ అధినేతలిద్దరూ 2019 ఎన్నికల ప్రచారంలోనూ ఇదే ఆరోపణలు చేసుకున్నారు. ఇందులో భాగంగా వివేకా హత్యకు టీడీపీనే కారణమంటూ పి. రవీంద్రనాథథ్ రెడ్డి కూడా ఆరోపించడం సంచలనం రేపింది. అంతేకాకుండా ఈయన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఫాలో అయ్యారు. ఆ తరువాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తు కాస్త ఆలస్య మైంది.

ఈ మధ్య సీబీఐ దూకుడు పెంచి ఈ కేసులో అవసరమున్నవారందరినీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని కూడా టీడీపీ పై చేసిన ఆరోపణల కారణంగానే విచారించినట్లు తెలుస్తోంది.  హత్యకు టీడీపీ కారణం అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా.. అని రవీంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. కానీ సీబీఐ విచారించిన తరువాత  రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 'వివేకా హత్య జరిగి రెండేళ్లకు పైగా అవుతోంది. ఇంకా మాకు దోషులెవరో తెలియడం లేదు. ఇది చాలా అవమానకరంగా ఉంది. ఇప్పటికైనా దోషులను త్వరగా తేల్చండి' అని సీబీఐని కోరినట్లు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన వ్యక్తే ఇలా అనడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును రాష్ట్రప్రభుత్వం ఛేదించలేకపోవడం వల్లే సీబీఐకి అప్పగించారని అరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డి కేసు ఆలస్యం అవుతుందనడం వ్యాఖ్యలు చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అంతకుముందు వైఎస్ వివేకా కూతురు, జగన్ చెల్లెలు అయిన సునీత తన తండ్రి చావును రాజకీయాల కోసం వాడుకోవడం  దుర్మార్గం అని అనడం సంచలనంగా మారింది. వివేకా హత్య కేసుపై అధికారంలో ఉన్న జగన్ బంధువులే ఆలస్యమవుతుందనడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే సీబీఐ ఈ కేసును ఎప్పటికి ఛేదిస్తుందోనని రాష్ట్రప్రజలు ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News