భగత్ సింగ్ కు జరిగిన అన్యాయంపై పాకిస్తాన్ ఆగ్రహం

Update: 2016-03-25 10:45 GMT
భారత స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ ను అన్యాయంగా ఉరి తీసినందుకు బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌-2 క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్‌ లోని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.  భగత్‌ సింగ్‌ వారసులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

భగత్‌ సింగ్‌ 85వ వర్ధంతి సభను పాకిస్థాన్ లో మానవహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఇస్లామాబాద్‌ లోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ కార్యాలయంలో అందజేసి బ్రిటిష్‌ రాణికి పంపించాలని కోరుతామని అబ్దుల్లా మాలిక్‌ అనే మానవ హక్కుల కార్యకర్త చెప్పారు. భగత్‌ సింగ్‌ ను ఉరి తీసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ లో రెండు ప్రాంతాల్లో భగత్‌ సింగ్‌ వర్ధంతి సభలను నిర్వహించారు. భగత్‌ సింగ్‌ జన్మస్థలమైన ఫైసలాబాద్‌ జిల్లా జరన్‌ వాలాలోని బంగాచాక్‌ లో  సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందినవారు హాజరయ్యారు. రెండవ సభను భగత్‌ సింగ్‌ ను ఉరి తీసిన షాద్మన్‌ చౌక్‌ లో నిర్వహించారు. భగత్‌ సింగ్‌ తోపాటు సుఖ్‌ దేవ్‌ - రాజ్‌ గురులను ఒకే రోజున ఉరి తీశారు.

కాగా ఇండియాలో దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని... దేశానికి వ్యతిరేకంగా నినదిస్తున్నవారిని భగత్ సింగ్ తో కాంగ్రెస్ నేతలు పోలుస్తున్న సమయంలో శత్రుదేశంలో భగత్ సింగ్ కోసం ఇలాంటి డిమాండ్ చేయడం మామూలు విషయం కాదు.
Tags:    

Similar News