పాక్ మార్కు: నిన్న స్వీట్లు.. నేడు కాల్పులు!

Update: 2016-08-15 04:26 GMT
కుక్కతోక వంకర అనేది పాత సామెతగా మారి.. పాక్ బుద్ది వంకర అనే కొత్త సామెతను ఇకపై ఇండియన్స్ వాడుకలోకి తీసుకురావొచ్చేమో. కుటిల నీతికి పెట్టింది పేరుగా ముందుకు వెళ్తున్న పాకిస్థాన్.. తాజాగా మరోసారి తనమార్కు తెలివితేటలను, తన మార్కు ఆలోచనావిధానాన్ని ప్రదర్శించింది. ఆ ప్రదర్శనకు స్వాతంత్ర దినోత్సవ రోజునే వేదికగా చేసుకుంది. ఒకవైపు అత్యంత ఘనంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న పాకిస్థాన్ మరోవైపు భారత్‌ పై కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం పాక్ కు కొత్తకాకపోయినా.. స్వాతంత్రదినోత్సవం రోజును కూడా వదల్లేని స్థాయికి చేరిపోయింది.

భారత్ కంటే ఒకరోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని (ఆగస్టు 14) నిర్వహించుకున్న పాక్ లో సంబరాలు అంబరాన్నంటాయి, దేశ సరిహద్దు ప్రాంతమైన వాఘాలో మన దేశానికి చెందిన సైనికులకు స్వీట్లు కూడా పంచిపెట్టారు. ఇంతవరకూ చేసి ఊరుకుంటే పాక్ కు మిగిలిన వారికీ తేడా ఏముంటుంది అనుకున్నారో ఏమో కానీ.. ఒకవైపు స్వీట్లు పంచిపెడుతూనే మరోవైపు సోమవారం (ఆగస్టు 15) తెల్లవారుజామున కశ్మీర్‌ లోని పూంచ్‌ ప్రాంతంలో భారత జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. పాక్ దుశ్చర్యకు అప్రమత్తమైన భారత సైనికదళాలు దాడిని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ విషయాలను డిఫెన్స్‌ అధికారి కల్నల్‌ మనీష్‌ మెహతా తెలిపారు.

కాగా కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐక్యరాజ్యసమితికి కంప్లైట్ చేసి, ఈ సమస్యను ప్రపంచ సమస్యగా చూపించే ప్రయత్నం చేసిన పాక్.. తాజాగా కశ్మీర్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వీడే ప్రసక్తి లేదని తెలిపింది. ఈ మేరకు దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ తన ప్రసంగంలో ఈ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు.
Tags:    

Similar News