హుజూరాబాద్‌లో `పంప‌కాలు` షురూ!

Update: 2021-07-18 08:30 GMT
ఇంకా ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ కూడా రాలేదు.. ఎన్నిక‌ల సంఘం అస‌లు దృష్టి కూడా సారించ‌నేలేదు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు పార్టీలు రెడీ అయిపోయాయి. ముఖ్యంగా జాతీయ పార్టీ బీజేపీ పంప‌కాలు ప్రారంభించేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది ఇంత‌కీ.. ఎక్క‌డ‌.. ఏం జ‌రిగిందంటే.. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసిన ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక రానుంది. దీనిపై ఇంకా నోటిఫికేష‌న్ కానీ, ఎన్నిక‌ల సంఘం సంప్ర‌దింపులు, చ‌ర్చ‌లు కానీ లేవు.

అయితే.. రాజ‌కీయంగా తీవ్ర ఉత్కంఠ‌కు దారితీస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌క్కించుకునేందుకు అధికార పార్టీ టీఆర్ ఎస్ స‌హా.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల‌.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో నోటిఫికేష‌న్ రాకుండానే.. ఈట‌ల స‌తీమ‌ణి.. జ‌మున ప్ర‌జ‌ల‌ను క‌లు స్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు తాయిలాలు పంచుతుండ‌డం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌డిచిన రెండు రోజులుగాముగ్గురు యువ‌కులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఇంటికీ తిరుగుతున్నారు.

బాహాటంగానే.. గోడ‌గ‌డియారాల‌ను పంచుతున్న వైనం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. ఇంటింటికీ తిరిగి.. పంపిణీ చేస్తున్న ఈ గోడ గ‌డియారాల్లో ఈటల ఫొటోతోపాటు.. బీజేపీ చిహ్నం క‌మ‌లం కూడా ముద్రించి ఉండడంతో ఈ ఘ‌ట‌న తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారితీస్తోంది. ప్ర‌జ‌ల నుంచి అప్పుడే పంప‌కాల‌పై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. అధికార పార్టీ కూడా దీనిని సీరియ‌స్‌గా తీసుకుంది. అయితే.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ లేకుండా.. పంప‌కాలు జ‌రుగుతున్నంద‌న‌.. ఇప్ప‌టికిప్పుడు దీనిపై కేసులు న‌మోదు చేసే అవ‌కాశం లేద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే, రాజ‌కీయంగా మాత్రం ఇది ఈట‌ల‌కు పెద్ద డ్యామేజీ అవుతుంద‌ని.. టీఆర్ ఎస్ నుంచి ప‌దునైన విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News