ఏపీలో ‘పంచాయతీ’.. ఏకగ్రీవాలపైనే అందరి దృష్టి!

Update: 2021-01-31 13:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే జగన్ సర్కార్..ఎన్నికల కమిషన్ మధ్య కొనసాగుతోన్న విభేదాలు, మాటల యుద్ధానికి స్థానిక రాజకీయాలు కూడా తోడు కాబోతునున్నాయి. నామినేషన్ల పర్వం ముగియబోతోండటంతో అందరి కళ్లూ ఇప్పుడు ఏకగ్రీవాల మీదే నిలిచాయి.

నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలూ తమ ప్రత్యర్థులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 9న నిర్వహించబోయే పోలింగ్ ఎలాంటి ఫలితాలను వెల్లడించబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో సరికొత్తగా నోటా (నన్ ఆప్ ద అబౌ)ను ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే ఈ నోటా పరిమితమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టబోతున్నారు.

స్థానిక స్వపరిపాలనకు గీటురాయిగ నిలిచే పంచాయతీ ఎన్నికల్లో నోటా వ్యవస్థను తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. తమకు అభ్యర్థులెవరూ నచ్చట్లేదనే అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు ఓటర్లకు ఉందని పేర్కొంది. దీంతో.. రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ నోటాను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను అందుబాటులోకి తీసుకొచ్చారు.




Tags:    

Similar News