కోటలోని మహారాజును బందీ చేశారు

Update: 2016-08-16 06:04 GMT
రాజ్యాలు పోయినా కొంతమంది రాజవంశీయుల్ని మహారాజులుగా వ్యవహరించే విషయం తెలిసిందే. గౌరవపూర్వకంగా ప్రజలు వ్యవహరించే ఈ మహారాజా పిలుపును స్వతంత్ర్య భారతంలో  ఎవరూ దుర్వినియోగం చేయలేదనే చెప్పాలి. తమ పరిధిని తెలుసుకొని.. తమ హద్దుల్లోనే ఉంటున్న మహారాజుల్ని ప్రజలు సైతం అంతే గౌరవంగా.. మర్యాదగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక మహారాజును ఆయన మేనేజరే కోటలో బంధీ చేసిన వైనం సంచలనంగా మారింది. స్థానిక రాజకీయ నేతలు.. ప్రజల కారణంగా ఈ వ్యవహారం బయటకువచ్చింది.

ఏపీ చివరన ఉండే శ్రీకాకుళానికి అనుకొని ఉండే పర్లాకిమిడి పేరుకు ఒడిశాలో ఉన్నప్పటికీ.. అక్కడ తెలుగు ప్రాంతీయుల పలుకుబడి కాస్త ఎక్కువే. పర్లాకిమిడి మహారాజు కమ్ మాజీ ఎంపీ గోపినాథ గజపతి ఆరోగ్యంతో ఆయన మేనేజర్ ఆటలాడుకున్న వైనం బయటకు వచ్చి ఇప్పుడా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆస్తి కోసం తన సోదరులతో కలిసి మహారాజును ఒక చిన్న గదిలో బంధించి.. మత్తుమందు ప్రయోగిస్తున్న వైనం బయటకు వచ్చింది.

మహారాజును ఆయన సహాయకులు ఏదో చేస్తున్నారన్న సందేహాలు వ్యక్తమైనా అందుకు సాక్ష్యం లభించలేదు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా రథయాత్ర సమయంలో రథానికి మహారాజు గోపినాథ గజపతి తొలిపూజ చేయటం ఆనవాయితీ. ఈ ఏడాది ఆయన బయటకు రాకపోవటం.. సిబ్బందిని అడిగితే అనారోగ్యంగా ఉన్నారని చెబుతున్నారేకానీ.. ఆయన్ను కలిసేందుకు అనుమతించటం లేదు.

దీంతో ఆగ్రహం చెందిన రాజకీయ నేతలు.. ప్రజలంతా కలిసి కోట వద్దకు వెళ్లారు. సిబ్బంది మాటను వినకుండా బలవంతంగా కోటలోకి చొచ్చుకుపోయిన వారికి.. ఒక చిన్న గదిలో మహారాజును మత్తులో ఉంచిన వైనం గుర్తించారు. వెంటనే ఆయనకు మెరుగైన వైద్యం చేసేందుకు వీలుగా విశాఖఫట్నం తరలించారు. అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నైకి పంపారు. మహారాజు మత్తులో అచేతనంగా పడి ఉండటంపై ఆయన మేనేజన్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు వచ్చాయి. ఆస్తి కోసం ఇంత దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
Tags:    

Similar News