పంజాబ్ పెద్దాయన ఇక లేరు.. 95 ఏళ్ల వయసులో కన్నుమూసిన బాదల్

Update: 2023-04-26 09:35 GMT
పంజాబ్ రాష్ట్రానికి పెద్దాయనగా.. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా.. శిరోమణి అకాలీదళ్ కు మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన 95 ఏళ్ల ప్రకాశ్ సింగ్ బాదల్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పంజాబ్ రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించిన ఆయన శాశ్విత నిద్రలోకి జారిపోయారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆయన్ను ఏప్రిల్ 16న మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు.  పరిస్థితి విషమించిన నేపథ్యంలో మంగళవారం ఆయన కన్నుమూశారు. సర్పంచ్ నుంచి మొదలైన ఆయన రాజకీయ జీవితం పంజాబ్ కు సీఎం స్థాయి వరకు ఎదిగారు.

తన ఇంటి పేరులోని బాదల్ గ్రామం నుంచే ఆయన 1952లో తొలిసారి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అప్పటికి పంజాబ్ లో సర్పంచ్ గా ఎన్నికైన వారిలో అత్యంత పిన్న వయస్కుడు ఆయనే కావటం గమనార్హం. 1927 డిసెంబరు 8న జన్మించిన ఆయన.. డిగ్రీని ఇప్పటికి పాక్ లోని లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే ఆయన రాజకీయ జీవితం మొదలైంది. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1969లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించటమే కాదు.. ఆ దఫా ఆయన మంత్రి అయ్యారు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదిసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1970లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. పంజాబ్ కు అత్యంత పిన్న వయసులో సీఎం అయిన రికార్డు ఆయనదే. కాకుంటే మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండలేకపోయారు.

ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. అత్యంత పెద్ద వయసు (2012)లో ముఖ్యమంత్రి గా వ్యవహరించిన రికార్డు ఆయనదే కావటం. తొలిసారి సీఎం అయినప్పుడు ఎక్కువ కాలం పదవిలో ఉండని దానికి బదులుగా.. తర్వాతి కాలంలో పలుమార్లు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత పెద్ద వయసు వ్యక్తి ప్రకాశ్ సింగ్ బాదలే. కాకుంటే.. ఆయన తన ప్రత్యర్థి.. ఆమ్ ఆద్మీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నికల్లో ఓడిన రెండో సందర్భం ఇదే కావటం గమనార్హం. తొలిసారి ఆయనకు 1967లో ఓటమి ఎదురు కాగా.. రెండోసారి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారు.

1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వ్యవహరించిన వేళలో.. ఆయన మంత్రివర్గంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2015లో ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో గౌరవించింది. కొత్త సాగు చట్టాల్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన 2020 డిసెంబరు మూడన.. తన పద్మవిభూషన్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఆయన సతీమణి సురీందర్ కౌర్ 2011లో క్యాన్సర్ కారణంగా మరణించారు. ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన బాదల్ గ్రామంలో జరగనున్నాయి. రాష్ట్రపతి.. ప్రధానితో సహా పలువురు ప్రముఖులు ఆయన మరణానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Similar News