ఇధ్దరు చంద్రుళ్లకు మంచి పేరు తెచ్చే ఛాన్స్!!

Update: 2016-06-10 06:50 GMT
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరు చెప్పిన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలు ప్లాష్ లా మదిలో మెదులుతాయి. ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు వినిపించినా జనం వాటిని పట్టించుకునే కన్నా.. ఆయన హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ.. 108.. పింఛన్ల పథకాల్ని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఒక్క ఆరోగ్య శ్రీ పథకం కారణంగా లక్షలాది మంది ఖరీదైన వైద్యసాయాన్ని పొందటమే కాదు.. ప్రాణాలు కూడా నిలిచాయి కూడా. వైఎస్ తర్వాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ లాంటి పథకాల్ని కొనసాగిస్తున్నా.. వాటి మీద ఫోకస్ తక్కువనే చెప్పాలి.

కానీ.. జనాల గుండెల్లో నిలిచిపోయే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు మరిన్ని మెరుగులు దిద్ది.. పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం.. నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాలే కానీ.. పాలకులు పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటం కష్టం కాదు. ఆరోగ్య శ్రీ తరహాకు చెందిన ఒక పథకాన్ని రాజస్థాన్ లో వసుంధరా రాజె ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా.. ఈ పథకం కింద ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది అందరి మన్ననలు పొందటమే కాదు.. మరింత మెరుగైన వైద్యసేవలకు అవకాశం ఇస్తుందని చెప్పాలి.

వసుంధరా రాజె సర్కారు అమలు చేస్తున్న ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇద్దరూ అమలు చేయగలిగితే మంచి పేరు రావటం ఖాయం. ఇంతకూ రాజస్థాన్ లో అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తే.. అక్కడ అమలు చేసే ఆరోగ్య బీమా పథకంలో ఒక కొత్త నిబంధనను చేర్చారు. దీని ప్రకారం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న రోగులు.. తాము సేవలు అందుకున్న ఆసుపత్రి వైద్య సేవలకు సంబంధించి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగా సదరు ఆసుపత్రి పని తీరును అంచనాకు ప్రభుత్వం తీసుకుంటుంది.

రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ రేటింగ్ విధానం సాయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ రేటింగ్ ఇవ్వటం తప్పనిసరి చేయటమే కాదు.. దీనికి సంబంధించిన ధ్రువపత్రాల్ని కూడా ఆసుపత్రుల్లో అందచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీ.. బీమా పథకాలకు సంబంధించి ఆసుపత్రుల పని తీరును రోగుల చేత ఫీడ్ బ్యాక్ తీసుకోవట మరింత మెరుగైన సేవలకు సాయం చేస్తుందనటంలో ఎలాంటి సందేహం ఉండదనే చెప్పాలి.
Tags:    

Similar News