ప్రభాస్, తారక్, మహేశ్‌ లపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-06-17 13:00 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారాహి యాత్ర చేపట్టారు. తాజాగా కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పవన్‌ భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఏ నటుడినైనా ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. అయితే రాజకీయాల్లో తమ సంక్షేమం కోసం పాటుపడే పార్టీనే ఎన్నుకోవాలని ప్రజలకు విన్నవించారు. రామ్‌ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్, చిరంజీవి ఇలా నటీనటులందరూ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. వాళ్ల పని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నారు. సినిమా పరిశ్రమ కేవలం తన సినిమాలతోనే మనుగడ సాగించదని తెలిపారు.

తన సినీ కెరీర్‌లో ఎప్పుడూ ఫ్యాన్స్‌ క్లబ్‌ లేదన్నారు. తాను గతంలో ఒక  బ్రాండ్‌ (పెప్సీ) కు ప్రచారం చేశానని.. అయితే ప్రజల సంక్షేమానికి ఉపయోగపడని దేనినీ ఆమోదించకూడదని నిర్ణయించుకున్నానని పవన్‌ గుర్తు చేశారు.

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో తానూ ఒకడినని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. తాను సంపాదించినప్పుడే ప్రజలకు సహాయం చేయగలనన్నారు. ఇలా భీమ్లా నాయక్, వకీల్‌ సాబ్‌ లాంటి సినిమాలు చేయడం వల్లనే కౌలు రైతులకు కోట్ల రూపాయలను విరాళంగా అందించగలిగానని గుర్తు చేశారు.

తాను ప్రతి సినిమా చేయడం ద్వారా 500-600 మందికి ఉపాధి కల్పిస్తున్నానని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. మట్టిని తరలించుకుంటూ రోజుకు రూ.2 కోట్లు దోచేస్తున్న కాకినాడ ఎమ్మెల్యే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా? అని ప్రశ్నించారు.

మనం డబ్బు సంపాదిస్తేనే దానం చేయగలమన్నారు. సంపదను సృష్టించాలని.. అప్పులు చేసి పంచకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వం సంపద సృష్టించలేదని ఆరోపించారు. కేవలం ప్రజాధనాన్ని దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. తాను సంపద సృష్టికి మార్గాలు చేస్తానన్నారు.

ఏటా ప్రతి నియోజకవర్గంలో 500 మంది చొప్పున యువకులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున ఇస్తానన్నారు. ఒక్కో యువకుడి ద్వారా మరో పది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. రూ.4 వేలకు, రూ.5 వేలకు చిల్లర పనులు చేసే ఉద్యోగాలు తానివ్వనని తెలిపారు. దయచేసి జనసేనకు అధికారం ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని పవన్‌ ప్రజలను అభ్యర్థించారు. మన కులపోడా కాదా అనేది చూడొద్దని.. ప్రజలకు మేలు చేసేవారికి, సమర్థుడికి ఓటేయాలని కోరారు.

Similar News