ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు దేనికి?: జగన్‌ ప్రభుత్వంపై పవన్‌ ఫైర్‌!

Update: 2023-02-18 15:10 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై నిప్పులు చెరిగారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ను విశాఖలో పోలీసులు కారు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం, విశాఖపట్నం వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇవ్వడం, జనసేన నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ను విజయవాడ నోవాటెల్‌ హోటల్‌ లో చంద్రబాబు కలిసి సంఘీభావం ప్రకటించారు.

అలాగే తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం, సభకు అనుమతి లేదని ఆయన ప్రచార వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం, టీడీపీ నేతలను అరెస్టు చేయడం వంటి వ్యవహారాలపై హైదరాబాద్‌ లో చంద్రబాబును కలసి పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలిపారు.

ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రమంతా చురుగ్గా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తపిస్తున్న ఆయన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు.

అయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. అక్కడ సభ పెట్టడానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. ముందుగా అనుమతి ఇచ్చి అడ్డుకోవడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పోలీసులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారని, నడి రోడ్డుపై బహిరంగ సభ పెట్టొద్దని మాత్రమే పోలీసులు చెప్పారని.. వేరే చోట సభ పెట్టుకోవాలని సూచించారని చెబుతున్నారు.

మరోవైపు చంద్రబాబు సభను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు అనపర్తిలో తీవ్ర నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సైతం ఒక ప్రకటన ద్వారా జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు దేనికి అంటూ పవన్‌ వైసీపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేఛ్చ లాంటి మాటలకు అర్థం తెలియదని పవన్‌ మండిపడ్డారు. రాజ్యాంగ విలువలపై ఈ పాలకులకు ఏమాత్రం గౌరవం కనిపించడం లేదని పవన్‌ ఆక్షేపించారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని జగన్‌ భావిస్తున్నారని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలకు అద్దం పడుతోందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవడానికి పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రజలు తమ నిరసనను తెలియజేయడం కోసం రోడ్డుపై బైఠాయించడం చూశాం కానీ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులే రోడ్డుకి అడ్డంగా కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్‌ ఎద్దేవా చేశారు. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయడం చూస్తుంటే వారిపై పాలకుల ఒత్తిడి ఎంతగా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పవన్‌ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గతంలో తనను కూడా ఇలాగే పలుమార్లు అడ్డుకున్నారంటూ కొన్ని ఘటనలను పవన్‌ ప్రస్తావించారు. గతంలో తాను జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళితే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్‌ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు వెళుతుంటే తనను అడ్డుకున్నారని పవన్‌ గుర్తు చేశారు. నడుస్తుంటే నడవకూడదని కూడా ఆంక్షలు పెట్టారని పవన్‌ నాటి పరిణామాలపై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని పవన్‌ ప్రశ్నించారు. దీన్ని బట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను సహించలేని స్థితికి ౖవైసీపీ పాలకులు చేరారనే విషయం అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే వైసీపీ పాలకులకు జీర్ణం కావడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయనే ఈ విషయాన్ని ఈ పాలకులు తెలుసుకోవాలని కోరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News