ప‌వ‌న్ పాద‌యాత్ర లేన‌ట్లేనా?

Update: 2017-11-10 04:47 GMT
కొద్దికాలంగా క‌నిపించ‌కుండా ఉంటున్న జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి తెలిసిందే. సెప్టెంబ‌రు రావ‌టం ఆల‌స్యం తాను యాక్టివ్ అవుతాన‌ని.. త‌న స‌మ‌యంలో మూడొంతులు రాజకీయాల‌కు కేటాయిస్తాన‌ని.. సినిమాల విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప‌వ‌న్ చెప్ప‌టం గుర్తుండే ఉంటుంది. పాద‌యాత్ర గురించి కూడా తాను ఆలోచిస్తున్న‌ట్లుగా చెప్పారు.

ఒక‌వేళ కుద‌ర‌ని ప‌క్షంలో బ‌స్సు యాత్ర లాంటిది ప్లాన్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా అందుతున్న స‌మాచారం ప్రకారం.. పాద‌యాత్ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సుముఖంగా లేర‌ని చెబుతున్నారు. పాద‌యాత్ర చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించినా.. ఆ విష‌యంలో ఆయ‌న‌కు చాలా సందేహాలు ఉన్న‌ట్లు చెబుతారు. సుదీర్ఘ కాలాన్ని కేటాయించాల్సి రావ‌టం.. అదే ప‌నిగా రోజుల త‌ర‌బ‌డి చేయ‌టంతో పాటు.. గ్లామ‌ర్ (సినిమాజీవుల‌కు చాలా అవ‌స‌ర‌మైన‌) తో పాటు.. ఆరోగ్యానికి సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉండ‌టంతో పాద‌యాత్ర‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పాద‌యాత్ర అన్న వెంట‌నే ఏదీ.. ఇట్టే జ‌రిగిపోదు. దాని వెనుక చాలా క‌స‌ర‌త్తు ఉండాలి. రోడ్డు మీద‌కు వ‌చ్చిన ఒక అధినేత న‌డుస్తున్నారంటే.. దాని వెనుక వంద‌లాది మంది నిత్యం శ్ర‌మించాల్సి ఉంటుంది. పార్టీకి భారీ బేస్ ఉండాలి. అవ‌న్నీ జ‌న‌సేన‌కు లేవ‌న్న మాట వినిపిస్తోంది. అన్నింటికి మించి పాద‌యాత్ర‌కు అయ్యే ఖ‌ర్చు కూడా త‌క్కువేం కాదు.  ఇంత ఆర్థిక భారాన్ని మోపే స్థాయిలో ప‌వ‌న్ లేర‌ని.. అందుకే పాద‌యాత్ర విష‌యంలో ఆయ‌న వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఒక‌వైపు ఏపీ విప‌క్ష నేత పాద‌యాత్ర చేస్తున్న వేళ‌.. మ‌రో పార్టీ అధినేత పాద‌యాత్ర చేయ‌టం జ‌ర‌గ‌దు. ఒక‌వేళ చేద్దామ‌నుకున్నా జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయ్యాకే సాధ్యం. ఒక‌వేళ అదే నిజ‌మ‌నుకుంటే.. జ‌గ‌న్ పాద‌యాత్ర మ‌రో ఎడెనిమిది నెల‌లు జ‌ర‌గ‌టం ఖాయం. అంటే.. వ‌చ్చే ఏడాది జులై వ‌ర‌కూ సాగుతుంది.

ఒక‌వేళ‌.. ప‌వ‌న్ అప్పుడు మొద‌లుపెట్టాల‌న్నా.. వెంట‌నే కుద‌ర‌దు. వ‌ర్షాకాలం పూర్తి అయితే.. చ‌లికాలం పూర్తి అయ్యాకేపాద‌యాత్ర‌కు అనువుగా ఉంటుంది. ఆ లెక్క‌న ఆగ‌స్టు.. సెప్టెంబ‌రులో పాద‌యాత్ర మొద‌లు పెట్టాలి. పాద‌యాత్ర అంటే క‌నీసం ఆర్నెల్లు అవ‌స‌రం.   ఆగ‌స్టులో పాద‌యాత్ర అనుకుంటే.. అక్క‌డి నుంచి ఆర్నెల్లు అంటే ఫిబ్ర‌వ‌రి.. మార్చి వ‌ర‌కూ ప‌డుతుంది. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చే వ‌ర‌కూ పాద‌యాత్ర చేయ‌టం సాధ్యం కాదు. తెర‌వెనుక చేయాల్సిన క‌స‌ర‌త్తు ఎంతో ఉంటుంది. ఇలాంటి లెక్క‌ల‌న్నీ చూస్తే.. ప‌వ‌న్ పాద‌యాత్ర ప‌క్కాగా లేన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News