దీన్ని డబ్బుతో కొన్న విజయం అనడం ఏమిటి పవన్?

Update: 2019-06-08 13:04 GMT
ఎన్నికలు సాగిన ప్రక్రియను జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తప్పు పట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓడిపోయిన ప్రతి వాళ్లు కూడా ఎన్నికలు సాగిన ప్రక్రియను తప్పు పడుతూ ఉంటారు. అక్కడే నేతల తీరు బయట పడుతూ ఉంటుంది. కొంతమంది అయితే ఎన్నికల ముందే ప్రకటించారు.. తాము గెలిస్తే ఎన్నికల ప్రక్రియ సరిగా సాగినట్టు, తాము ఓడిపోతే ఎన్నికల ప్రక్రియ తప్పుగా సాగినట్టు అని వారు చెప్పుకొచ్చారు.

ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన పక్షం రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ సరిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ కల్యాణ్ చెప్పుకురావడం ప్రహసనం . ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు అయిన మాట వాస్తవమే, ప్రధాన పార్టీలు అన్నీ ఖర్చు పెట్టాయి. ఆఖరికి జనసేనతో సహా! దీన్ని కాదు అని అంటు అది బుకాయింపే అవుతుంది.

విజయం మీద ఆశలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు కూడా గట్టిగా ఖర్చు పెట్టారు! అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి అనే తాయిళాలు ప్రయోగించారు. డబ్బులు కూడా పంచారు. ఒక చోట జనసేన అభ్యర్థికి సంబంధించి భారీగా డబ్బు కూడా పట్టు  పట్టింది. విజయం మీద ఆశలు ఉన్న వాళ్లు అలా ఖర్చు పెట్టారు. బహుశా ఎలాగూ గెలవడం సాధ్యం కాదని భావించిన వారు ఖర్చు పెట్టలేదేమో!

ఈ మాత్రం దానికే జనసేన మాత్రమే నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసింది అని చెప్పుకోవడం కేవలం బుకాయింపే అవుతుంది.డబ్బు ఖర్చు పెడితేనే ఎన్నికల్లో నెగ్గేట్టు అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టారని జనసేనే అంటోంది కదా, ఆ పార్టీ ఎందుకు నెగ్గలేదో జనసేనే ఒక థియరీని చెప్పాలి!

ఏపీ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చారు. ఏకంగా నూటా యాభై ఒక్క సీట్లను ఒకే పార్టీకి కట్టబెట్టారు. అది కూడా అతి భారీ మెజారిటీలు ఇచ్చి వారిని గెలిపించారు. ఆ పార్టీ ఏదైనా ప్రజలు సుస్పష్టమైన తీర్పును ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో అయినా పదివేలు, పాతిక వేలు మెజారిటీలు వచ్చేలా ఓట్లను కొనగలిగే  మొనగాడు ఇంకా ఈ భూమ్మీద పుట్టి ఉండకపోవచ్చు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో నలభై ఎనిమిది మంది ముప్పై  వేలకు పైగా మెజారిటీలు సాధించారు. కాబట్టి.. ప్రజా తీర్పు ఏమిటో స్పష్టంగా గమనించి పవన్ కల్యాణ్ దాన్ని గౌరవిస్తే బావుంటుంది. అంతే కానీ ఎన్నికలు జరిగిన పద్ధతి గురించి ఇలాంటి కామెంట్లు చేయడం అంత సమంజం అనిపించుకోదేమో!
Tags:    

Similar News